
నోటీసులతోనే సరి!
సాక్షి, వరంగల్: పురాతన భవనాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మీనమేషాలు లెక్కిస్తోంది. ఏటా వర్షాకాలానికి ముందే శిథిల భవనాలపై టౌన్ ప్లానింగ్ సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. శిథిల, ప్రమాదకర భవనాల్లో ఉన్న వారిని గుర్తించాలి. అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు వారికి ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు చు ట్టూ బారికేడ్లను అమర్చాలి. కానీ.. శిథిల భవనాల గుర్తింపు, గతంలో నోటీసులిచ్చినా భవనాల పటిష్టత, మరమ్మతు పనుల అంశాలపై సమీక్షించినా అది కూడా తూతూ మంత్రంగానే సాగిందనే విమర్శలు వస్తున్నాయి. వర్షాలకు నాని కూలిపోయే ప్రమాదం ఉండడంతో పాత భవనాలను తొలగించాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లో నగరంలోని 66 డివిజన్లలో 450 పాత భవనాలున్నట్లు లెక్క తేల్చా రు. వీటిలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 పాత ఇళ్లను కూల్చారు. 122 ఇళ్లల్లో ఉంటున్న వారి ని ఖాళీ చేయించారు. మరో 288 మందికి నోటీసులు జారీ చేసిన అధికారులు ఆ తర్వాత అటువైపు చూడడం లేదన్న విమర్శలున్నాయి. ఇవి అంతకుమించి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈనెల 7న వరంగల్‌లో 70.9 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్‌లో 65.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే రోజుల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రమాదకర భవనాల్లోని నివాసితుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఏదైనా ఘటన జరగకముందే అధికారులు అప్రమత్తమై శిథిల భవనాలపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.
పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిందే..
వానాకాల విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పాత భవనాల పటిష్టత, భద్రతపై ఇంజనీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అత్యంత ప్రమాదకర కట్టడాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే చేయాలి. ఈ డ్రైవ్‌లో భాగంగా పురాతన భవనాలపై జోన్ల వారీగా సర్వే చేయాలి. సంబంధిత భవన నాణ్యతపై పరిశీలించి ప్రమాదకర భవనాలకు నోటీసులు జారీ చేసి కూల్చివేయాలి. అయితే ఇది కొంతవరకు జరిగినా.. పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి కేంద్రీకరించలేదన్న ఆరోపణలున్నాయి. భారీ వర్షాలు కురిస్తే గ్రేటర్ వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉంది. ఈనేపథ్యంలో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పురాతన భవన యజమానులను ఖాళీ చేయిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటపడినవారవుతారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగినా ప్రేక్షకపాత్రకే బల్దియా పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
శిథిల భవనాల యజమానులకు జారీ చేసి చేతులు దులుపుకున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు
గ్రేటర్ వరంగల్‌లో
వందల సంఖ్యలో నివాసాలు
కూలిపోయి ప్రమాదం
జరిగితే ప్రాణనష్టం
వర్షాకాలం కావడంతో
బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
కమిషనర్ దృష్టి సారిస్తేనే
సమస్య కొలిక్కి
ఎక్కడెక్కడున్నాయంటే..
వరంగల్ నగరంలోని మట్టెవాడ, మండిబజార్, చార్‌బౌళి, దేశాయిపేట, రామన్నపేట, పాత బీట్‌బజార్ వ్యాపార కూడలి, వరంగల్ చౌరస్తా, స్టేషన్‌రోడ్డు, ఎల్బీనగర్, కాశిబుగ్గ, లేబర్ కాలనీ, ఖిలావరంగల్ ఫోర్ట్ రోడ్డు, చింతల్, ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేట, తిమ్మాపూర్, మామునూరు, నక్కలపల్లి, గొర్రెకుంట, ధర్మారం, మొగిలిచర్ల, పైడిపల్లి తదితర ప్రాంతాల్లో పాత ఇళ్లను గుర్తించి నోటీసులు జారీ చేశారు. హనుమకొండలోని కుమార్‌పల్లి, కొత్తూరు జెండా, హంటర్ రోడ్డు న్యూశాయంపేట, వడ్డేపల్లి, డీజిల్ కాలనీ, కాజీపేట దర్గా, సోమిడి, బాపూజీనగర్, రైల్వే క్వార్టర్స్, పెద్దమ్మగడ్డ, హసన్‌పర్తి, చింతగట్టు, రాంపూర్, మడికొండ తదితర ప్రాంతాల్లో శిథిల దశకు చేరుకున్న భవనాలు ఉన్నాయి.

నోటీసులతోనే సరి!

నోటీసులతోనే సరి!