
మరో ఏడు నెలలే..!
సాక్షిప్రతినిధి, వరంగల్:
జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి సర్కారు గడువు దగ్గర పడుతోంది. 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే.. సుమారు 21 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక మొదట 2025 డిసెంబర్ నాటికి దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మూడు పర్యాయాలు ‘దేవాదుల’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, మేలో ములుగు జిల్లా కన్నాయిగూడెం, హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మరో ఏడు నెలలే గడువు ఉండడంతో మంత్రులు తరచూ పర్యటించి సమీక్షలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది.
భూసేకరణే అసలు సమస్య..
దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి మూడో దశలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో మొత్తం 33,224 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, దశలవారీగా 30,268 ఎకరాలు చేశారు. జనగామ, పాలకుర్తి, గజ్వేల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,956 ఎకరాల వరకు భూ సేకరణ చిక్కుముడిగా మారింది. రోజురోజుకూ భూముల ధరల పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, భూములు ఇచ్చిన కొందరు ధర గిట్టుబాటు కాలేదని కోర్టుకు వెళ్లడం లాంటి కారణాలతో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. 2024 ఆగస్టు నాటికి రూ.17,500 కోట్లు దాటిందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు 91 శాతం పూర్తయి, సగానికి పైగా ఆయకట్టుకు నీరందిస్తున్నా.. 9 శాతం పెండింగ్ పనులతో అసంపూర్తి ప్రాజెక్టుల ఖాతాలో చేరింది.
మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ(సీతక్క), ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం 3:45 గంటలకు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం హెలిపాడ్‌కు మంత్రులు చేరుకుంటారు. 3:50 గంటలకు సమ్మక్కసాగర్ బ్యారేజీ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్‌కి సంబంధించిన పంపింగ్ స్టేషన్‌ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు హెలికాప్టర్‌లోనే హైదరాబాద్‌కు బయల్దేరుతారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు.
దేవాదుల ప్రాజెక్టు
దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సర్కారు డెడ్‌లైన్
2026 మార్చి నాటికి పూర్తయ్యేనా..
భూసేకరణకు అడ్డంకులు
ఇప్పటికే నాలుగు పర్యాయాలు
ప్రాజెక్టుపై సమీక్ష
9 శాతం పెండింగ్‌తో అసంపూర్తి...
రూ.17,500 కోట్లకు అంచనా...
నేడు డిప్యూటీ సీఎం, ఉత్తమ్ సహా
ఐదుగురు మంత్రుల రాక
సమ్మక్క బ్యారేజీ పరిశీలన..
అనంతరం అధికారులతో సమీక్ష
9 జిల్లాలకు ప్రయోజనం..
ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని 9 జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 9 శాతం పనులు మిగిలి ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా.. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. అదనంగా మరో 89 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, మూడో దశలో నిలిచిపోయిన భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు 21 ఏళ్లయినా అసంపూర్తిగానే ఉంది. రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి భూసేకరణకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 31న కన్నాయిగూడెం బ్యారేజీ వద్ద జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి 2026 మార్చిలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు.