
నేడు డీవార్మింగ్ డే
ఎంజీఎం: జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ నేడు (సోమవారం) డీవార్మింగ్ డే సందర్భంగా నులిపురుగుల నిర్మూలన కోసం అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 2,35,000 మంది 1–19 వయస్సు ఉన్న పిల్లలున్నారని, కలెక్టర్ సూచన మేరకు ప్రతీ అంగన్‌వాడీ కేంద్రం పరిధి పాఠశాల, కళా శాలకు ఒక అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా, ఏఎన్‌ఎంలను అనుసంధానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో 623 మంది ఆశా కార్యకర్తలు, 201 ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, 780 మంది అంగన్‌వాడీ టీచర్లు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అఽధికారి మహేందర్ మాట్లాడుతూ 1, 2 ఏళ్ల వారికి సగం మా త్ర పొడి చేసివ్వాలని, 2 ఏళ్ల నుంచి ఆపై 19 ఏళ్ల వారందరికీ ఒక మాత్ర చప్పరించి లేదా నమిలి మింగించాలన్నారు. భోజనానంతరం వీరందరికీ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
రేపు కేయూలో
లైబ్రేరియన్స్ డే
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా), యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం, టీఎస్ లైబ్రరీ అసోసియేషన్ (టీఎస్‌ఎల్‌ఏ) ఆధ్వర్యంలో ఈనెల 12న లైబ్రేరియన్స్ డే నిర్వహించనున్నారు. ఈమేరకు కేయూ లైబ్రరీ ఇన్‌చార్జ్ ఐసాక్ ప్రభాకర్, టీఎస్‌ఎల్‌ఏ ట్రెజరర్ డాక్టర్ జి.రాజేశ్వర్‌కుమార్, కుల్పా ట్రెజరర్ ఎం.మనోహర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. క్యాంపస్‌లోని కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా వీసీ కె.ప్రతాప్‌రెడ్డి హాజరుకానున్నారు. కుప్లా అధ్యక్షుడు డాక్టర్ ఎ.నాగేశ్వర్‌రావు అధ్యక్షత వహిస్తారు. ‘రోల్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఇన్ ది డిజిటల్ ఎరా’ అంశంపై లైబ్రరీ సైన్స్‌విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రమణయ్య కీలకోపన్యాసం చేస్తా రు. ‘రెలవెన్స్ ఆఫ్ డాక్టర్ రంగనాథన్ ఇన్‌ది ఏజ్ ఆఫ్ ఐఐ’ అంశంపై కేయూ లైబ్రరీ మెంబర్ ఇన్‌చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ రాధికారాణి ప్రసంగిస్తారు. కుల్పా జనరల్ సెక్రటరీ వి.కృష్ణమాచార్య, టీఎస్‌ఎల్‌ఏ జిల్లా జనరల్ సెక్రటరీ ఇ.సత్యనారాయణరావు పాల్గొంటారని వారు తెలిపారు.
ఓటు వ్యవస్థను
ధ్వంసం చేస్తున్న బీజేపీ
హన్మకొండ చౌరస్తా: ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ.. అధికారం కోసం బీజేపీ కొనసాగిస్తున్న తంతును బహిర్గతం చేయడమే తమ బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో ఆదివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు వినిపించారు. బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తూ, దొంగ ఓట్లను సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈవిషయంపై క్షేత్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సందేశాన్ని అందించారు. ఇందులో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, పసునూరి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, పోతుల శ్రీమన్నారాయణ, సయ్యద్ విజయ శ్రీ, వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు బంక సరళ, బొమ్మతి విక్రమ్, దేవేందర్‌రావు, రామకృష్ణ, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హేమాచలుడికి
భక్తిశ్రద్ధలతో పూజలు
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామి వారిని దర్శించుకున్నారు. పూజారులు పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో అర్చనలు జరిపారు.