శోభాయమానంగా అమ్మవారికి పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా చివరిరోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పసుపు కొమ్ములు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి చూర్ణోత్సవం జరిపారు. ముఖ్యార్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు చక్రతీర్థోత్సవం నిర్వహించారు. మంగళవాయిద్యాలతో తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. మధ్యాహ్నం పూర్ణాహుతి, బలిహరణ, భేరీతాడనం, ధ్వజావరోహణ తదితర అనుష్టాన కార్యక్రమాలు నిర్వహించారు. శతఘటాభిషేకం నిర్వహించి అమ్మవారి పూలమాలలతో అలంకరించారు. పూజా కార్యక్రమాలకు హైదరాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీదేవి అసోసియేట్స్ వారు ఉభయదాతలుగా వ్యవహరించారు.
శోభాయమానంగా పుష్పయాగం..
రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛాటన చేస్తుండగా.. పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి మాట్లాడుతూ.. కల్యాణ బ్రహ్మోత్సవాలు విజయవంతమవ్వడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్‌కుమార్ పర్యవేక్షించారు. సిబ్బంది అలుగు కృష్ణ, చింత శ్యాంసుందర్, నాగులు పాల్గొన్నారు.
భద్రకాళి ఆలయంలో ముగిసిన
కల్యాణ బ్రహ్మోత్సవాలు
ఽవైభవంగా చూర్ణోత్సవం, ఘటాభిషేకం


