శాయంపేట : మండలంలోని పత్తిపాక గ్రామంలో మొరం తవ్వకాలు చేపట్టొద్దని జరిపితే అడ్డుకుంటా మని గ్రామస్తులు హెచ్చరించారు. ఆదివారం సీఐ రంజిత్‌రావు, ఎస్సై జక్కుల పరమేశ్ గ్రామస్తుల ఫిర్యాదుతో చేపల చెరువు కోసం తవ్వకాలు జరిపే పొలాన్ని పరిశీలించారు. భారీ వాహనాల రాకపోకల వల్ల సీసీ రోడ్లు దెబ్బతినడమే కాకుండా నల్లా పైపులైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువు పేరిట ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని మొరం తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు సీసీ రోడ్డుపై పిల్లలు తిరుగుతుంటారని, భారీ వాహనాలు నడవడం వల్ల దుమ్ము, దూళి లేస్తుందని ప్రతి రోజు రోడ్డుపై నీళ్లు చల్లాలని, నల్లా పైపులైన్లు దెబ్బతినకుండా చూసుకోవాలని గ్రామస్తులు పోలీస్ అధికారులకు తెలిపారు. గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకొని మొరం తవ్వకాలు జరిపే పొలంను పోలీసులు పరిశీలించి వెళ్లిపోయారు.


