జెట్‌స్పీడ్‌లో ‘మామునూరు’
తుది అంకంలో 223 ఎకరాల భూసేకరణ
సాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్ట్ భూ సేకరణ పనులు జెట్‌స్పీడ్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని మరో 253 ఎకరాల భూసేకరణ చివరిదశకు చేరుకుంది. ఈ 253 ఎకరాల్లో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, 223 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములున్నాయి. ఇందులో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి సంబంధించిన వారి ఖాతాల్లో రూ.220 కోట్లు జమచేశారు. మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూమి 15 ఎకరాలు ఉండగా ఈ మేరకు ఆ డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే సాదాబైనామాకు సంబంధించి ఐదు ఎకరాలు ఉండడంతో ఆ భూమి ఎక్కడినుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలను పరిశీలిస్తూనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే చేసి క్లియర్ చేస్తున్నారు. మరో 10 ఎకరాల భూమి ఉన్న రైతుల నుంచి పట్టా పాస్‌బుక్‌లు, అలాగే 12 మంది ఇళ్లు ఉన్నవారి వివరాలు సేకరించి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 330 మంది భూనిర్వాసితులు ఉంటే 260 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మరో 40 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు బిల్లులు రెడీ అయ్యాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అవార్డు పాసైన రోజుల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు దశలవారీగా భూమిని రిజిస్ట్రేషన్ చేసి బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది. ఇలా ఇప్పటివరకు సేకరించిన 213 ఎకరాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తోంది.
అధికారుల సమన్వయంతో..
ఎయిర్‌పోర్టుకు సంబంధించి వివిధ విభాగాల అ ధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నా రు. కొందరికి పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడం, సర్వే నంబర్ల మిస్ మ్యాచ్, కొన్ని భూములపై మా ర్ట్‌గేజ్ లోన్లు, సాదాబైనామా భూముల ద్వారా కాస్త ఆలస్యమైనా.. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు భూమి సరిహద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్‌లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండేళ్లలో మామునూరులో విమానాశ్రయ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు.
ఇప్పటికే రూ.220 కోట్లు
రైతుల ఖాతాల్లో జమ
మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధం


