యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

Apr 22 2025 1:10 AM | Updated on Apr 22 2025 1:10 AM

యధావి

యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

వాయిదా వేయాలని రిజిస్ట్రార్‌కు వినతి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలా బాద్‌ జిల్లాలో ఈనెల 26వ తేదీ నుంచి పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు యధావిధిగా నిర్వహించనున్నామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌ సోమవారం తెలిపారు. కొద్దిరోజులుగా కొందరు పీజీ కోర్సుల విద్యార్థులు ఆయా నాలుగో సెమిస్టర్ల పరీక్షలు వాయిదావేయాలని అధికారులను కోరుతూ వస్తున్నారు. సోమవారం కూడా రిజిస్ట్రార్‌ రామచంద్రంను కలిసి విన్నవించారని సమాచారం. ఆ తర్వాత పీజీ కోర్సుల పరీక్షలు వాయిదావేశారనే అంశం యూనివర్సిటీలో ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల పోరాట ఫలితంగా పరీక్షలు వాయిదావేశారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈనెల 26వ తేదీ నుంచి జరిగే పరీక్షలను సోమవారం వాయిదా వేయలేదన్నారు. అయితే విద్యార్థులు వాయిదావేయాలని కోరుతున్నారన్నారు. ఈవిషయంపై మంగళవారం యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హాస్టళ్ల డైరెక్టర్‌, పరీక్షల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించి పీజీకోర్సుల నాలుగో సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించాలా.. వాయిదా వేయాలా అనే అంశం నిర్ణయిస్తామని రాజేందర్‌ తెలిపారు.

కాజీపేట లోకోపైలెట్‌ డిపోపై మరో పిడుగు..

నాలుగు క్రూ లింక్‌ల తరలింపునకు సిద్ధం

ఆందోళనలో లోకోపైలెట్లు

కాజీపేట రూరల్‌ : కాజీపేట రైల్వే లైకోపైలెట్‌పై మరో పిడుగు పడింది.కాజీపేట క్రూ కేంద్రంగా పని చేస్తున్న కోచింగ్‌ క్రూ లింక్‌లలో కొన్ని లింకులు కృష్ణా, ఎల్‌టీటీ, కోణార్క్‌, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లను విజయవాడ గాల డిపోనకు తరలిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే లోకోపైలెట్లు సోమవారం రాత్రి తెలిపారు. మంగళవారం నుంచి అధికారికంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ లింక్‌లను విజయవాడ నుంచి ఆపరేట్‌ చేస్తున్నట్లు, ఇందుకు సంబంధించిన చార్ట్‌ తయారు చేశారని వారు తెలిపారు. గతంలో ఈ లింక్‌లను కాజీపేట డిపో వారే అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో నడిపేవారని పేర్కొన్నారు. 2022లో సికింద్రాబాద్‌ రైల్వే అధికారులు రెండు ట్రేడ్‌యూనియన్ల నాయకులతో చర్చించి కాజీపేటకు కేటాయించిన ఈ లింక్‌లను భవిష్యత్‌లో కాజీపేటలో ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ నాలుగు క్రూలింక్‌లను మార్చడం కాజీపేట డిపోనకు గుదిబండగా మారిందని లైకోపైలెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కాజీపేట నుంచి 185 పోస్టులను ఇతర క్రూ డిపోలకు తరలించగా ఇప్పుడు లింక్‌ల తరలింపు నిర్ణయం ఆందోళనకు గురిచేస్తుందని లోకోపైలట్లు, రైల్వే నాయకులు వాపోతున్నారు. కాజీపేట లోకోపైలెట్‌ డిపో నుంచి పోస్టులు, లింక్‌ల తరలింపు జరగకుండా మరోసారి ప్రజాప్రతినిధులు, రైల్వే నాయకులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని లోకోపైలెట్లు కోరుతున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సికింద్రాబాద్‌ రైల్వే అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని లోకోపైలెట్లు వేడుకుంటున్నారు.

చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు

జనగామ రూరల్‌: చెల్లని చెక్కు ఇచ్చిన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంత గట్టు నాగారం మాజీ సర్పంచ్‌ ఇరుమళ్ల రాజయ్యకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 7 లక్షల జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ జి. శశి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా నర్మెట గ్రామానికి చెందిన గంగుల శ్రీనివాస్‌ రెడ్డికి మాజీ సర్పంచ్‌ ఇరుమళ్ల రాజయ్య రూ.6 లక్షల 66 వేల అప్పు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో 2016 ఆగస్టు 9వ తేదీన రాజయ్య తన అప్పును నగదుకు బదులు చెక్కు రూపేణ ఇచ్చాడు. ఈ చెక్కు చెల్లకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన మేజిస్ట్రేట్‌.. రాజయ్యకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 7 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు బాధితుడి తరఫున న్యాయవాది ఎలగందుల చంద్రరుషి తెలిపారు.

యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు  
1
1/2

యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు  
2
2/2

యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement