ఖిలా వరంగల్: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర శాసన మండలి సభ్యుడు బస్వరాజు సారయ్య సూచించారు. వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే రైతు ఉత్పత్తుల మేళాను మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధతో కలిసి ఎమ్మెల్సీ సారయ్య.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దని, రైతును బలోపేతం, చైతన్య పర్చడానికే ఎఫ్‌పీఓ మేళా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ రైతులు ఆర్థిక బలోపేతం, లాభసాటి సాగుకు ఎఫ్‌పీఓల పాత్ర కీలకమన్నారు. 40 ఉత్పత్తి దారుల సంఘాలు స్టాళ్లు ఏర్పాటు చేయగా .. ఆ ఉత్పత్తుల అమ్మకాలు చేపడుతున్నామన్నారు.
ఎఫ్‌పీఓ మేళాకు స్పందన..
ఎఫ్‌పీఓ మేళాకు స్పందన లభించింది. రాష్ట్రం నలు మూలాల నుంచి భారీగా రైతులు, నగర ప్రజలు చేరుకున్నారు. స్టాళ్లను ఆసక్తిగా తిలకించి అవసరమైన పనిముట్లు, గృహోపకరణాలు, విత్తనాలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఏసీ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ రామన్‌సింగ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పీజేటీఏయూ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, అగ్రికల్చర్ జూయింట్ డైరెక్టర్ సుజాత, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, తహసీల్దార్లు బండి నాగేశ్వర్‌రావు, ఇక్బాల్, ఉద్యాన శాఖ అధికారి సంగీత లక్ష్మి, ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్ ఈదుల అరుణ్, రైతులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
జీఎం కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్రస్థాయి (ఎఫ్‌పీఓ) రైతు ఉత్పత్తుల
మేళా ప్రారంభం
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి