భూ భారతితో ధరణి సమస్యల పరిష్కారం
పాలకుర్తిటౌన్: ధరణితో తలెత్తిన సమస్యలకు భూభారతితో పరిష్కారం లభించనుందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. లీప్స్ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సదస్సుకు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, భూభారతి చట్ట రూపకర్త భూమి సునీల్‌కుమార్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో కేసీఆర్ చేసిన పాపాల ఫలితాన్ని తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. ధరణి పోర్టల్‌ను అమెరికా కంపెనీకి అప్పగించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ఆరోపించారు. భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఆర్‌ఓఆర్ చట్టం, భూభారతిని తీసుకొచ్చిందన్నారు. భూభారతి చట్ట రూపకర్త భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో సమస్యలు పునరావృతం కాకుండా భూ హక్కులకు హామీ ఇచ్చేలా భూభారతి చట్టం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలపై అధ్యయనం చేసి కొత్త చట్టానికి రూపకల్పన చేశామన్నారు. త్వరలోనే నియమ నిబంధనలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిందన్నారు. భూములపై రైతులకు హక్కులు కల్పించేలా భూ భారతి చట్టం ఉంటుందన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి చట్టం అడ్డు పెట్టుకుని ప్రజల హక్కులను కాలరాసిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డి, లీప్స్ సలహాదారు కరుణాకర్ దేశాయి, రైతు కమిషన్ సభ్యులు భవాని, చెవిటి వెంకన్న, అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్, పాలకుర్తి, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, మంజుల, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి


