TS Warangal Assembly Constituency: TS Election 2023: మరోసారి రహస్యంగా భేటీ అయిన ఏడుగురు కార్పొరేటర్లు!
Sakshi News home page

TS Election 2023: మరోసారి రహస్యంగా భేటీ అయిన ఏడుగురు కార్పొరేటర్లు!

Sep 24 2023 1:24 AM | Updated on Sep 24 2023 9:36 AM

- - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ తూర్పు బీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం తారస్థాయికి చేరుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తమ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు పార్టీ మారతారంటూ తనకున్న సామాజిక మాధ్యమాలు, మీడియా సెంటర్‌ ద్వారా ప్రచారం చేయించి అగ్నికి ఆజ్యం పోస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. నాయకుడంటే అందరినీ కలుపుకొని పోవాలి కానీ తూర్పులో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని, అతను చెప్పిందానికి ఊ కొడితేనే సరి.. లేకపోతే పోలీస్‌స్టేషన్లలో లేనిపోని కేసులు నమోదవుతాయని, పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించిన సందర్భాలున్నాయని కొందరు కార్పొరేటర్లు వాపోతున్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే నరేందర్‌ ఎంత దుష్ప్రచారం చేసినా.. పార్టీని వీడేదే లేదని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఏ అభ్యర్థిని రంగంలోకి దింపినా.. అతడికంటే నాలుగు రెట్లు ఎక్కువగా కష్టపడి గెలిపించేందుకు కృషి చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం నగరంలోని ఓ ముఖ్య నేత ఇంట్లో తూర్పు బీఆర్‌ఎస్‌ ప్రధాన నాయకత్వంతోపాటు ఏడుగురు కార్పొరేటర్లు సమావేశమయ్యారు. వీరిలో గుండేటి నరేందర్‌ కుమార్‌, సయ్యద్‌ మసూద్‌, బైరబోయిన దామోదర్‌, సిద్దం రాజు, బస్వరాజు శ్రీమాన్‌, ఆకుతోట శిరీశ్‌, బస్వరాజ్‌ కుమార్‌ ఉన్నారు.

ఒంటెద్దు పోకడలతో విరక్తి చెందే..
‘ఎమ్మెల్యే ఎవరైనా ఉదయం లేవగానే సమస్యలతో వచ్చే ప్రజల కోసం గ్రీవెన్స్‌ నిర్వహిస్తుంటారు. తూర్పులో అలాంటి పరిస్థితి లేదు. ఉదయం 11 గంటలు దాటితే గానీ.. ఇంటి నుంచి బయటికెళ్లని పరిస్థితి ఉంది. ఎవరైనా వచ్చినా గంటల తరబడి వేచి చూసి ఎమ్మెల్యేను కలవకుండా వెళ్లిన సందర్భాలు అనేకం’ అని పలువురు కార్పొరేటర్లు చెబుతున్నారు.

కార్పొరేటర్లుగా ప్రజలనుంచి చివా ట్లు చాలా ఎదురయ్యాయని, ఆయన ఒంటెద్దు పోకడలతో క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ పసనూరి దయాకర్‌ తదితర ముఖ్య నేతలను కూడా పట్టించుకోకుండా అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ పార్టీని డిస్టర్బ్‌ చేస్తున్నార అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో డివిజన్లలో కార్పొరేటర్లకు సమాన స్థాయిలో నలుగురు కార్యకర్తలను పెట్టుకుని, వారికి నెలనెలా జీతాలు ఇస్తూ కార్పొరేటర్లను డమ్మీలు చేసే వ్యవస్థను నెలకొల్పారని వాపోతున్నారు.

వారిని దగ్గరకు తీసి మార్కులు కొట్టేదామనుకుంటున్నారు..
తామేదో డబ్బుల కోసం ఆశపడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తమ డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనుల్లో రావాల్సిన కమీషన్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల వద్ద తీసుకున్న ఎమ్మెల్యే.. శుక్రవారం కొందరికి ఇచ్చినట్టుగా తెలిసిందని వీరు అంటున్నారు.

కేడాల జనార్దన్‌ హాజరైన గురు, శుక్రవారం సమావేశాల్లో నరేందర్‌ అభ్యర్థిత్వం మార్చాలని చెప్పిన రోజే.. అతడి భార్య కేడాల పద్మతోపాటు, పోశాల పద్మ, పల్లం పద్మ, కావేటి కవిత, మరిపల్లి రవి, దిడ్డి కుమారస్వామి ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి తమ పనులు చేసుకున్నారన్న ప్రచారం కోడై కూస్తోంది. వీరిచ్చిన సపోర్ట్‌తోనే ఎమ్మెల్యే అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేదామనుకుంటున్నారని, ఎమ్మె ల్యే గొప్ప నాయకుడు అంటూ వారి వాయిస్‌లు తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.

తాము ఉద్య మ సమయాల్లో ఆత్మగౌరవంతో బతికినవాళ్లమని, ప్రశ్నించినా కార్యకర్తలపై సొంత పార్టీ అని చూడకుండా కేసులు పెట్టించి మరీ చిత్రహింసలకు గురి చేశారని అసంతృప్త కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో సైని కుల్లా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచన చేస్తే గెలుపు అవకాశాలు సులభంగా ఉంటాయని నిర్ణయానికి వచ్చారు. వీరి విజ్ఞాపనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అందరినీ కలుపుకొని పోయే నేతను ప్రకటించాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement