హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో వినాయకచవితిని పురస్కరించుకుని శ్రీ ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. రెండవ రోజు మంగళవారం ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో గణపతిని శ్రీఉత్తిష్టగణపతిగా పూలదండలతో అలంకరించారు. వేముల సత్యమూర్తి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ప్రారంభించారు. సాయంత్రం నాగమణిచే హరికథా కాలక్షేపం అలరించింది.
కేయూకు ముగిసిన
సెలవులు..
● బకాయిలు చెల్లిస్తేనే మెస్ కార్డుల రెన్యూవల్
● ఎస్‌ఎఫ్‌సీ విద్యార్థులకు హాస్టల్ వసతి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీకి ఈనెల 18వ తేదీతో సెలవులు ముగిశాయి. మంగళవారం నుంచి తరగతుల ప్రారంభమయ్యాయి. హాస్టల్ వసతితోపాటు మెస్‌కార్డులు రెన్యూవల్ చేస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో హాస్టల్‌వసతి, మెస్‌కార్డులు కలిగిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు పోనూ మిగతా మెస్ బిల్లుల బకాయిలు చెల్లిస్తేనే మెస్‌కార్డులు జారీ చేస్తున్నట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్ వెంకయ్య తెలిపారు. పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పూర్తిచేసుకున్న మూడోసెమిస్టర్ల విద్యార్థులకు రెగ్యులర్ కోర్సులతోపాటు, ఎస్‌ఎఫ్‌సీ విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కల్పించనున్నారు. మంగళవారం వరకు మెస్‌లను రీఓపెన్ చేయలేదు. కనీసం వందం మంది విద్యార్థులు కార్డులు తీసుకుంటే మెస్ ఓపెన్ చేస్తామని డైరెక్టర్ తెలిపారు. బీ ఫార్మసీ మొదటి సంవత్సరంలో ఇటీవల చేరిన విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి మెస్‌కార్డులు జారీచేస్తున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్ : నర్సంపేట, వర్ధన్నపేట, నెక్కొండ వరంగల్‌లో ఉన్న భవిత కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థులకు స్పీచ్ థెరపీ సేవలు అందించేందుకు తాత్కాక ప్రాతిపదికన అర్హులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ డీఈఓ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి స్పీచ్ ఽథెరపీ క్యాంపునకు రూ.1000 గౌరవేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులను ఈనెల 23లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
విద్యుదాఘాతంతో రైతు..
బయ్యారం: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం మండలంలోని నాగారం తండాలో జరిగింది. తండాకు చెందిన అజ్మీరా వీరన్న(27) తన మిర్చి తోట లో దమ్ము చేయడానికి వెళ్ళారు. ఈ క్రమంలో వీరన్న ఎత్తుకొస్తున్న ఇనుపగొర్రు.. తోటలో ఉన్న విద్యుత్ స్తంభానికి సపోర్ట్‌గా వేసిన వైరుకు తగిలింది. దీంతో విద్యుత్ సరఫరా అయి వీరన్న అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య లలిత, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉపేందర్ తెలిపారు. కాగా, వీరన్న మృతి తో పండుగ (వినాయకచవితి) రోజు తండాలో విషాదం నెలకొంది.


