1947 సెప్టెంబర్‌ 2 పరకాల ఘటనను గుర్తు చేసిన చంద్రారెడ్డి

తెలంగాణ సమరయోధుడు రేగూరి చంద్రారెడ్డి   - Sakshi

పరకాల: తెలంగాణ సాయుధ పోరాటంలో 1947 సెప్టెంబర్‌ 2న పరకాలలో జరిగిన పోరాటం చిరస్మరణీయంగా నిలిచింది. ఎంతో మంది ఉద్యమకారుల వీరమరణంతో పరకాల నేల రక్తసిక్తమై నేటికి 76 ఏళ్లు. మరో జలియన్‌వాలా బాగ్‌గా పిలిచే నాటి పోరాటంలో పాల్గొన్న వ్యక్తి పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన 98 ఏళ్ల పోలీస్‌పటేల్‌ రేగూరి చంద్రారెడ్డి. పోలీస్‌గా పనిచేసిన ఆయన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్శితులై నిజాం సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. పరకాలలో ఆ రోజు ఏం జరిగింది? అంత మారణహోమం జరగడానికి దారి తీసిన పరిస్థితులపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

తెలంగాణలో రజకార్ల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయేది. గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు నిద్రహారాలు మానేవారు. ఎప్పుడు ఏ గ్రామంపైనా.. ఎవరిని ఏం చేస్తారో తెలియని భయానక వాతావరణం ఉండేది. నేను నిజాం సర్కార్‌లోనే పోలీస్‌ పటేల్‌గా పనిచేసేవాడిని. అప్పటి పరిస్థితులను చూసి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మారుపేరు రంజిత్‌తో తిరుగుబాటుదారులైన ఎస్‌.మనోహర్‌రావు, కేవీనర్సింగరావుకు సన్నిహితమయ్యా. వారి పోరాట కార్యాచరణలో భాగస్వాముడినయ్యా. సాయుధ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, రజాకార్ల ఆగడాలపై సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం.

మూడు కిలోమీటర్ల పొడవుతో ఊరేగింపు
ఆ రోజు 1947 సెప్టెంబర్‌ 2. అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు నిజాం నిరంకుశ పాలనను, రజకారులను ఎదిరిస్తూ త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి అనేక గ్రామాలనుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. యూనియన్‌ పతాకాలు, వడిసెలు, చేతి కర్రలు పట్టుకుని పతాక వందనానికి కదం తొక్కారు. తొలుత చాపలబండ నుంచి దగ్గు వీరగోపాల్‌రావు నాయకత్వాన ఊరేగింపు నిర్వహించాం. మూడు కిలోమీటర్ల పొడవుతో సాగిన మా ఊరేగింపులో హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని, వందేమాతరం అంటూ నినాదాలు చేశాం.

గర్జించిన నిజాం పోలీసుల తుపాకులు
మా ఊరేగింపు సమాచారం తెలియగానే అప్పటికే ఇక్కడ నిజాం మిలిటరీ పోలీసులు మకాం వేశారు. రజాకారులు కత్తులు, బరిసెలతో సిద్ధమై ఉన్నారు. తహసీల్దార్‌ విష్ణువేశ్వర్‌రావు ఊరేగింపు వద్దకు వచ్చి వెనక్కి తిరిగి రావాల్సిందిగా మా అందరికి (ఉద్యమకారులకు) హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తహసీల్దార్‌ అనుమతి మేరకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చేతిలోని పిస్తోల్‌ ధన్‌మని పేలడంతో నిజాం పోలీసుల తుపాకులు గర్జించాయి. మా కంటే ముందు వరుసలో ఉన్న శ్రీశైలంతోపాటు అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాపలబండ ప్రాంతం రక్తంతో తడిసిముద్దయింది. అక్కడినుంచి నేను తప్పించుకున్న. వారం రోజులకు నన్ను దొరకబట్టి చిత్రహింసలకు గురిచేశారు. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. నాటి ఉద్యమ ఫలితంగా తెలంగాణకు విముక్తి లభించడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top