పోటీలో అత్యధికంగా స్వతంత్రులు
ఎక్కడెక్కడ.. ఎలా ఉంది?
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్‌లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలు
స్వతంత్ర అభ్యర్థులు
సాక్షిప్రతినిధి, వరంగల్:
మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్‌ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్‌గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
టఫ్ ఫైట్..
స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్‌లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొత్తం మున్సిపాలిటీలు 12మొత్తం వార్డులు 260బరిలో ఉన్న అభ్యర్థులు 1,073 కాంగ్రెస్ 260బీఆర్‌ఎస్ 259బీజేపీ 240స్వతంత్రులు 314
హనుమకొండ పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబల్స్ కూడా) పోటీలో ఉన్నారు. మొత్తం 50 మందిలో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది.
జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్‌ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్‌ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు.
మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు.
కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్,బీఆర్‌ఎస్‌లు అన్ని వా ర్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. 11మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్‌ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు.
ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు.
పోటీలో అత్యధికంగా స్వతంత్రులు


