అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఎక్కడాలోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్‌పేపర్లు, సీల్స్, స్టేషనరీ, పోలింగ్‌కు అవసరమైన ఇతర సామగ్రిని కలెక్టర్ శనివారం క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్ట్రాంగ్ రూంలు, పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ కమిషనర్లు సుధీర్‌కుమార్, భాస్కర్, డీఏఓ ఫణికుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026 – 28వ సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యాలు పంపిన జాబితాలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే సమాచార శాఖ వెబ్‌సైట్ ఐఅండ్‌పీఆర్.తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


