తెనాలి/కొల్లిపర: కరువు, ప్రభుత్వ అసమర్ధ చర్యలతో అవస్థలు పడుతున్న రైతాంగానికి పులిమీద పుట్రలా వరుస తుపానులు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆర్నబ్, ఆ తర్వాత మురసు తుఫాన్లతో దెబ్బతిన్న రైతులు తేరుకోకముందే ఇప్పుడు ‘రాక్షస తుఫాన్’ (అక్వాన్) శరవేగంగా తరుముకొస్తోంది. అది తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈనెల 20న తీరం దాటుతుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు బెంబేలు పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎన్నో రకాలుగా అవస్థలు పడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంటలను తుఫాన్ రక్కసి దెబ్బతీస్తుందేమోనని బెంగిల్లుతున్నారు.
హడావుడి కోతలు
ఖరీఫ్ సీజనులో ముందుగా వరిసాగు చేసే కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని తెనాలి నియోజకవర్గంలో మాగాణి చేలల్లో సాగుచేసిన వరిపైరు మరో పదిరోజుల్లో కోతలు ఆరంభిస్తారు. ముందుగా ముదురు వరిచేలు, క్రమంగా ఆ తర్వాత వెదజల్లిన చేలల్లో కోతలు చేస్తారు. కూలీల కొరత, పెట్టుబడి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా వరి నూర్పిడి యంత్రాలనే వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఒకే రోజులో కోత, నూర్పిడి పూర్తిచేసి ధాన్యాన్ని అప్పగించే యంత్రాలదే రాజ్యమైంది. ఇటీవలే రెండు తుఫాన్లనుభ చవిచూసిన డెల్టా రైతులు మూడోపర్యాయం భీకరంగా రానుందనే అక్వాన్ తుఫాన్ హెచ్చరికలతో పదిరోజులకు చేపట్టాల్సిన వరి కోతలను ఇప్పుడే ఆరంభించారు. తెనాలి రూరల్ మండలంలోని బుర్రిపాలెం, సోమసుందరపాలెం, కొల్లిపర మండల పరిధిలోని తూములూరు, దావులూరు, హనుమాన్‌పాలెం. చివలూరు, కొల్లిపర, మున్నంగి, వల్లభాపురం గ్రామాల్లోని వరి పొలాల్లో వరి నూర్పిడి యంత్రాలు సందడి చేస్తున్నాయి. నియోజకవర్గంలో అత్యధికశాతం రైతులు బీపీటీ–5204 వరి రకాలనే సాగుచేశారు. ఎకరాకు 35–40 బస్తాల వరకు దిగుబడి సాధించే అవకాశాలున్నాయి.
వరుస తుఫాన్లతో కుదేలు
వరుస తుఫాన్ల కారణంగా, ప్రత్యేకించి ఇటీవలి ‘మురసు’ దెబ్బకు విస్తారంగా కురిసిన వర్షాలకు దాదాపు15 వేల ఎకరాల్లో వరిపైరు నీటమునిగింది. నేలకొరిగిన పంటను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. పంటను పైకిలేపి నిల్చోబెట్టటం, చేలల్లోంచి వర్షపునీటిని బయటకు పంపుకొంటూ తీవ్రంగా శ్రమించారు. సూపర్ ఎల్‌నినో, తుఫాన్లతో ఎకరాకు 10–15 బస్తాల వరకు దిగుబడిని కోల్పోతామని రైతుల్లో అంచనా ఉంది. ఇప్పుడు మళ్లీ అక్వాన్ తుఫాన్ దాడిచేస్తే వరి గింజ దక్కదన్న భీతి అన్నదాతలను వెంటాడుతోంది. దీంతో ముందస్తుగా కోతలకు వచ్చే వరి చేలల్లో పదిరోజులకు ముందే కోతలకు దిగారు. దీనివల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగి, రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం తగ్గిపోతుంది. అయినప్పటికీ పంటను కోల్పోవకపోవటమే మంచిదన్న భావనతో అన్నదాతలు ఇందుకు సిద్ధపడ్డారు.
కొనుగోలు కేంద్రాలేవీ?
తుఫాన్లకు జరిగిన పంట నష్టం అంచనాల్లోనే ఉన్న ప్రభుత్వం, రాబోయే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై దృష్టిపెట్టలేదు. దీనితో మద్దతు ధర దక్కే అవకాశం కనిపించటం లేదు. గత ఖరీఫ్ సీజనులో వరి కోతల సమయంలో 75 కిలోల ధాన్యం బస్తా రూ.1500 ఉండగా, కోతలు ముగిసేనాటికి రూ.1600లకు కొనుగోళ్లు జరిగాయి. రైతుల్నుంచి ధాన్యం కొనుగోళ్లు జరిగిన తర్వాత ధాన్యం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వ్యాపారులు తేమను బట్టి బస్తా రూ.1900–2100లకే కొనుగోలు చేస్తున్నారు. అసలే దిగుబడి తగ్గిందని రైతులు బాధపడుతుంటే మద్దతు ధర దక్కకపోవటం మరింత బాధిస్తోంది. ప్రభుత్వం త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
కొల్లిపర మండలంలో కోతకు వచ్చిన వరి పంట
నేను పదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. గతేడాది మొంథా తుఫాన్‌కు నష్టపోయిన పంటకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. మళ్లీ వరుస తుఫాన్లతో చేతికొచ్చే ధాన్యం పోతుందేమోనని భయంగా ఉంది. ఏం చేయాలో తెలియటం లేదు. దేవుడిపై భారం వేశాం.
– ఎ.పూర్ణచంద్రరావు, రైతు, ఖాజీపేట


