21, 22 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ | - | Sakshi
Sakshi News home page

21, 22 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

గుంటూరు వెస్ట్‌: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ, పొన్నూరు పురపాలక సంఘం ఎన్నికలకు ఈ నెల 21, 22 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పురపాలక ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, రిసెప్షన్‌ కేంద్రాలను ఎంపిక చేసి, అక్కడ పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

19న జెడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలు

జెడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలు 19వ తేదీన నిర్వహిస్తామని కలెక్టర్‌ చెప్పారు. వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, ఉపాధ్యక్షులు, అధ్యక్షుల ఎన్నిక క్రమపద్ధతిలో జరగాలని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన నోటీసులు జారీ చేశామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండోదశ నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. రెండో దశ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ నెల 25, 26 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, మూడవ దశలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు 28, 29 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రస్తుతానికి నిర్ణయించడం జరిగిందని చెప్పారు.

ఏఎన్‌యూలో ఎన్నికల సామగ్రి పంపిణీ

ఎంటీఎంసీ కమిషనర్‌ అలీం బాషా మాట్లాడుతూ ఎంటీఎంసీ ఎన్నికల సామగ్రి పంపిణీకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశామని చెప్పారు. రిసెప్షన్‌, స్ట్రాంగ్‌ రూములను కూడా విశ్వవిద్యాలయంలోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం పోలింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో 477 మంది పాల్గొన్నారని అన్నారు. 570 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పొన్నూరు మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ శిబిరంలో సోమవారం 129 మంది హాజరయ్యారన్నారు. 170 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాస రావు, కె.శ్రీరమణి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగసాయి కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement