భక్తులతో కళకళలాడిన కాకాని శివాలయం కోటి సోమవారం పూజల్లో తరించిన భక్తులు
పెదకాకాని: ఓం నమఃశివాయ నామంతో శ్రీ మల్లేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం దద్దరిల్లింది. పెదకాకాని శివాలయంలో కార్తిక మాస శ్రవణా నక్షత్రంతో కూడిన కోటి సోమవారం పర్వదినం పురస్కరించుకుని వేకువజాము నుంచే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈశాన్య భాగంగా స్వామివారికి అభిషేక పూజలు చేశారు. అర్చకులు భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలు అందజేశారు. భక్తులందరికీ స్వామివారి ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉప కమిషనరు పి.శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. స్వామి వారి దర్శించుకున్న వారిలో దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కె.రామచంద్రమోహన్ దంపతులు ఉన్నారు. కార్తికమాస మొదటి సోమవారం వివిధ సేవా రుసుములు, ప్రసాదం విక్రయాలు, అన్నప్రసాద విరాళాల ద్వారా రూ. 9,25,000 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.


