రాజధానికి నిలిచిన రాకపోకలు
● జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం ● మురసు దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తం ● ప్రధాన రహదారులు జలమయం
కొరిటెపాడు (గుంటూరు): మురసు తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లి వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలకు వరి, పత్తి, మినుము, అరటి, కూరగాయలు, పూల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల అర్నబ్ తుఫాన్‌కు జిల్లాలో సుమారు 23 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మళ్లీ ఇప్పుడు ఇంకా భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
వర్షపాతం వివరాలివీ...
జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు అత్యధికంగా ఫిరంగిపురం మండలంలో 178.2, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 51 మి.మీ. మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 107.2 మి.మీ.గా నమోదైంది. మండలాలవారీగా... గుంటూరు పశ్చిమలో 173.4, పెదకాకానిలో 168.2, గుంటూరు తూర్పులో 143.8, మేడికొండూరులో 140.4, కాకుమానులో 133.2, ప్రత్తిపాడులో 117.8, తాడికొండలో 106.4, చేబ్రోలులో 104, తుళ్లూరులో 96.4, తాడేపల్లిలో 83.4, పెదనందిపాడులో 82.8, మంగళగిరిలో 80, కొల్లిపరలో 79.5, దుగ్గిరాలలో 65.4, తెనాలిలో 64.8, వట్టిచెరుకూరు మండలంలో 60.3 మి.మీ. నమోదైంది. జిల్లాలో మొత్తం 1,928.8 మి.మీ. కురిసింది.
కొండరాయి పడి వ్యక్తి మృతి
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని రాజాపేట సమీపం కార్మెల్ కొండ దిగువ భాగంలోని పాకలో రైతు కె.కృష్ణారెడ్డి పశువులను కట్టి వేశారు. మేత వేశాక వర్షం పెద్దది కావడంతో అక్కడే ఉండిపోయాడు. ఇంతలో కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చిన పెద్దరాయి రెండు గేదెలకు తగులుతూ కృష్ణారెడ్డి పకగా వెళ్లి గోడను ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారెడ్డి (65)తోపాటు గేదెలు కూడా మృతి చెందాయి. తండ్రి రాలేదని కుమారుడు రాజారెడ్డి వెళ్లి చూడగా విషయం వెలుగుచూసింది. కృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నీటిలో చిక్కుకున్న 12 మంది
ఫిరంగిపురం: భారీ వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో వర్షపు నీరు చేరింది. ఫిరంగిపురం– 113 తాళ్లూరు దారిలో రెండు ఆటోలు, ఒక కారులో వెళుతున్న 12 మంది నేరెళ్లవాగు చప్టా ప్రాంతంలో నీరు రోడ్డుపైకి చేరడంతో చిక్కుకుపోయారు. అటువైపుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని కాపాడారు.
నిలిచిన రైళ్లు
తాడేపల్లి రూరల్: విజయవాడ జంక్షన్ నుంచి తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ మీదుగా చైన్నె, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే రైల్వే మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్‌లో ప్రధాన రైళ్లైన 22602 మధురై ఎక్స్‌ప్రెస్, 22185 ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, 12510 చైన్నె వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. చైన్నె రైల్వే ట్రాక్‌పై రాకపోకలు పునరుద్ధరించడంతో తాడేపల్లిలో నిలిచిన రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గంటల కొద్దీ కృష్ణా కెనాల్ జంక్షన్‌లో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దాతల సహకారంతో భోజనం
తెనాలి: బాపట్ల, చినగంజాం వద్ద బలమైన గాలులు వీయడంతో విజయవాడ వైపు నుంచి వెళ్లే పలు రైళ్లను తెనాలి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత తెనాలి చేరుకున్న న్యూఢిల్లీ–పాండిచ్చేరి (నెం. 22404), విశాఖపట్నం–తిరుపతి (నెం. 18507) రైళ్లను ఇక్కడే నిలిపివేశారు. సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నెం. 12296) ఉదయం 6.30 గంటలకు తెనాలి చేరుకోగా, ఇక్కడే నిలిపివేశారు. స్టేషన్ మేనేజర్ వెంకటరమణ సూచన మేరకు ఆయా రైళ్లలోని ప్రయాణికులకు ఆహారం అందించారు. పట్టణానికి చెందిన శ్రీచంద్రశేఖర గురుపాదుకా పీఠం నిర్వాహకులు రామకృష్ణశర్మ సహకారంతో 1,500 మందికి, తహసీల్దార్ గోపాలకృష్ణ వితరణతో మరో 500 మందికి పైగా ప్రయాణికులకు భోజనం అందించారు. కొన్ని గంటల తర్వాత రైళ్లను పంపించారు.
తాడికొండ: మురుసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అమరావతి– గుంటూరు ప్రధాన రహదారిపై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీల సాయంతో చెట్లను తొలగించారు. భారీగా వరద ముంచెత్తడంతో లాం వద్ద కొండవీటి వాగు పొంగి రోడ్డుపైకి నీరు చేరింది. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు, అనంతవరం రోడ్డులో వాగు పొంగి పొర్లాయి. దీంతో రాజధానికి మళ్లీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొండవీటి వాగుకు వరద ఉప్పొంగడంతో పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరింది. పత్తి, మిర్చి, వరి, అపరాల పంటలు నీట మునిగి దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుళ్ళూరు మండలం లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద తగ్గే వరకు పునరావాస కేంద్రంలో వసతి కల్పించనున్నట్లు తహసీల్దార్ హరిబాబు తెలిపారు.


