కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలోనూ దందాలు ఏఎన్‌యూ కౌంటింగ్ కేంద్రంలో ‘కూటమి’ అరాచకం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు నామమాత్రపు మెజార్టీ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయాల ప్రకటనలో నాన్చివేత ధోరణి కౌంటింగ్ కేంద్రంలోనే ఉదయం నుంచి కూటమి నేతలు మకాం
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిచినా..
నెహ్రూనగర్/గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి నేతలు చేసిన అక్రమాలు ఓట్ల లెక్కింపులోనూ కొనసాగాయి. ఓట్ల లెక్కింపును సైతం తమకు అనుకూలంగా మలచుకునేందుకు అడ్డదారులు తొక్కారు. పోలీసులను, అధికారులను తమ వైపునకు తిప్పుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 76 వార్డులకు జరిగిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూటమి నేతల కనుసన్నల్లోనే కొనసాగింది. టీడీపీ మేయర్ అభ్యర్థి భర్త, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు కౌంటింగ్ కేంద్రంలోనే తిష్టవేశారు. కౌంటింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, కౌంటింగ్ సిబ్బందిని ప్రభావితం చేసే విధంగా అధికార దర్పాన్ని ప్రదర్శించారు. లెక్కింపు ప్రక్రియను మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సి ఉన్నా 10 గంటలకు సైతం ప్రారంభం కాలేదు. భారీ వర్షం కురుస్తుండటంతో సిబ్బంది సకాలంలో రాలేదు. ఏఎన్‌యూలోని నాలుగు బ్లాకుల్లో ఏర్పాటు చేసిన 51 కౌంటింగ్ కేంద్రాల్లోని హాళ్లకు బ్యాలెట్ బాక్సులను చేర్చి కౌంటింగ్ ప్రారంభించడంతో తీవ్ర జాప్యం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను తెరిచి, 25 కట్టలుగా కట్టి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 14 మంది మేయర్ అభ్యర్థులతో పాటు 333 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వేర్వేరుగా ఏర్పాటు చేసిన టేబుళ్లపై లెక్కించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలను రాత్రి వరకు సైతం కచ్చితంగా ప్రకటించలేదు. కార్పొరేటర్ అభ్యర్థుల ఫలితాలను ప్రకటించేందుకు అర్ధరాత్రి వరకు సమయం తీసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు నామమాత్రపు మెజార్టీతో గెలిచినా వెంటనే ప్రకటిస్తూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ వారి వివరాలను ప్రకటించడంలో పక్షపాతంగా వ్యవహరించారు. గెలిచిన కూటమి అభ్యర్థులకు అప్పటికప్పుడే రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాలను అందజేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ధ్రువపత్రాలను ఇవ్వడంలో తాత్సారం చేశారు. ఈ విధంగా 7వ వార్డు నుంచి ఫారూక్ మహమ్మద్, 22వ వార్డు నుంచి షేక్ అమీనా బేగం గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు. 2, 8, 12, 16, 36, 38, 58 వార్డుల్లో అభ్యర్థులు మెజార్టీతో గెలిచినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. 60వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మలిశెట్టి దీనమ్మ 16 ఓట్ల తేడాతో గెలుపొందగా, టీడీపీ శ్రేణులు అభ్యంతరంతో రీకౌంటింగ్ జరిపినట్లు సమాచారం. అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేందుకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. కూటమి అభ్యర్థుల వెంట వచ్చిన నేతలకు అధికారులు ఎర్రతివాచీ పరిచారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను మాత్రం ప్రధాన గేటు వద్దే నిలువరించారు. కాలినడకనే వారు కిలోమీటర్ల మేర నడిచి, వర్షంలో తడుస్తూ కేంద్రానికి వచ్చారు.


