సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత 7వ విడత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 10వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేపూడి విజయకుమారి తన ప్రత్యర్థిపై 427 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రేపూడి విజయకుమారి పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలైంది. వార్డుల పునర్విభజన అనంతరం ఆమె ప్రస్తుత ఎన్నికల్లో 10వ వార్డు నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం గమనార్హం.
గుంటూరుఎడ్యుకేషన్/నెహ్రూనగర్:నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు నేతలపై ఇష్టారాజ్యాంగా ఆంక్షలు విధించిన పోలీసులు, అధికారులు ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో మీడియాకు అందించడంలో విఫలం చెందారు. ఏఎన్యూలోని కౌంటింగ్ కేంద్రం సమీపంలో మీడియా కోసం ఏర్పాటు చేసిన భవనంలో కనీస వసతులు కరువయ్యాయి. మీడియాకు సమాచారాన్ని పంపేందుకు అవసరమైన ఇంటర్నెట్, ఫలితాలను రౌండ్ల వారీగా తెలుసుకునేందుకు సరైన వ్యవస్థను అందుబాటులో ఉంచకపోవడంతో మీడియా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం వరకు ఎల్ఈడీ టీవీలు సక్రమంగా పనిచేయకపోవడం.. ఇంటర్నెట్ రాకపోవడంతో ఫలితాలు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కవరేజ్ చేసేందుకు వెళ్లి మీడియాను సైతం అనుమతించలేదు. ముఖ్యంగా అధికారికంగా జారీ చేసిన మీడియా పాసులను ధరించి వెళ్లినప్పటికి సాక్షి ప్రతినిధులను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు కౌంటింగ్ కేంద్రం వద్దే బల్లలు వేసి మరి కూర్చోబెట్టారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతాన్ని మీడియా పాయింట్లో ఉన్న ప్రతినిధులకు తెలియకపోగా..బయట ఉన్న టీడీపీ నేతలకు మాత్రం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించారు.
సత్తెనపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వరికల్లు రమాదేవి తన ప్రత్యర్థి పై 100 ఓట్ల మెజార్టీతో మంగళవారం గెలుపొందింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె భర్త వరికల్లు కోటేశ్వరరావు 449 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. అప్పట్లో 1,600 ఓట్లు ఉండగా ఇటీవల వార్డుల పునర్విభజనతో 1,300 ఓట్లకు కుదించారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో కోటేశ్వరరావు భార్య రమాదేవి బరిలో నిలవగా అధికార పార్టీ నుంచి అనేక ఓత్తిళ్లు వచ్చినప్పటికి వాటికి ఏ మాత్రం బెదరకుండా బరిలో నిలిచి 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. వరుసగా రెండో సారి ప్రజలకు సేవ చేసే అవకాశం రావ డంతో పలువురు ఆ భార్యభర్తలను ప్రత్యేకంగా అభినందించారు.
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్నకు గుంటూరుకు చెందిన భక్తురాలు వెలగలేటి సత్యవతి మంగళవారం సుమారు రూ.11.63 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను సమర్పించారు. వీటిని వెలగలేటి దుర్గాదేవి జ్ఞాపకార్థం దాత కుటుంబ సభ్యులు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావుకు అందజేశారు. లక్ష్మీదేవి రూపులు, ముత్యాలు, ఎరుపు, తెలుపు, పచ్చ రాళ్లతో డిజైన్ చేసిన సుమారు రూ.10.85 లక్షల విలువైన 72 గ్రాముల బరువు గల రెండు పేటల బంగారు లక్ష్మీదేవి మెట్ల హారంతోపాటు, అష్టలక్ష్ముల రూపాలతో సుమారు రూ.78 వేలు వెచ్చించి తయారు చేయించిన 340 గ్రాముల నగిషీ వెండి చెంబును అందించారు.


