ఆన్‌లైన్ నమోదులో రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం
గెలిచిన అభ్యర్థుల వివరాలు అప్‌లోడ్ చేయడంలో అలసత్వం
అర్ధరాత్రి వరకు టెన్షన్‌లోనే అభ్యర్థులు, వారి అనుచరులు
నెహ్రూనగర్/గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఫలితాల ప్రకటనలో రిటర్నింగ్ అధికారులు(ఆర్వో) తీవ్ర జాప్యం ప్రదర్శించారు. కౌంటింగ్ పూర్తయి అభ్యర్థులు గెలుపొందినప్పటికీ, వారి వివరాలను సకాలంలో ఆనన్‌లైన్‌లో నమోదు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఏ అభ్యర్థి అధికారికంగా గెలిచారనే స్పష్టత రాక అర్ధరాత్రి వరకు అభ్యర్థులు, వారి అనుచరులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
కొన్ని వార్డుల్లో సాయంత్రం వరకూ అదే పరిస్థితి..
ఎన్నికల ఫలితాలు వెలువడి గంటలు గడుస్తున్నా.. మధ్యాహ్నం, సాయంత్రం 5 గంటల వరకు కూడా కొన్ని కీలక వార్డులకు సంబంధించిన వివరాలను అధికారులు అధికారికంగా అప్‌లోడ్ చేయలేదు. ముఖ్యంగా 1, 26, 27, 28, 29, 33, 39, 40, 75, 76 వార్డులకు సంబంధించిన గెలుపు వివరాలను సకాలంలో ఆన్‌న్‌లైన్‌లో పొందుపరచలేదు. అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆయా వార్డుల ప్రజలు, అభ్యర్థులు ఫలితాల కోసం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.


