ముందుగానే
‘జాబితా’ సిద్ధమైందా?
వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుంటే రౌడీషీట్ !
పట్నంబజారు: కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలైన వేళ గుంటూరు నగరంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీకి చెందిన క్రియాశీల నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగా పోలీసులు తానా అంటే తందానా అంటూ.. పార్టీ శ్రేణులను భయాందోళనలకు గురి చేస్తున్నారు.
‘జెండా పట్టుకుంటే అంతుచూస్తా’
గత రెండు రోజుల క్రితం గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఒక పోలీసుస్టేషన్ అధికారి ఒక మాజీ రౌడీషీటర్‌ను స్టేషన్‌కు పిలిపించారు. గతంలో ఒక కేసు ఉన్న నేపధ్యంలో కేసు కొట్టి వేయటంతో పాటు, అతనిపై ఉన్న రౌడీషీట్‌ను కూడా తొలగించారు. అయినప్పటీకీ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా తిరుగుతున్నాడనే ఉద్దేశ్యంతో అతన్ని స్టేషన్‌కు పిలిపించి.. వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ప్రచారం చేస్తున్నావేంటంటూ.. అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ సీపీకి ప్రచారం చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం.. ‘నా కొ...ల్లారా’ అని అంటూ సదరు స్టేషన్ అధికారి దుర్భాషలకు దిగాడు. దీనితో పాటు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థుల పక్కన తిరిగే వారికి ఫోన్‌లు చేసి ఆధార్ కార్డులు తీసుకుని స్టేషన్‌లకు రావాలంటూ.. ఆయా స్టేషన్‌ల సీఐల కనుసన్నల్లో ఎస్‌ఐలు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఎందుకని ప్రశ్నిస్తే.. స్టేషన్‌కు రాకపోతే కేసులు నమోదు చేస్తామని ఫోన్‌ల్లో వార్నింగ్‌లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తామేమైనా తప్పు చేస్తే చెప్పాలని, తమకు నచ్చిన పార్టీ వైపు తిరిగినా.. వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని తిరిగినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులే హెచ్చరిస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.
ఆధార్‌తో స్టేషన్‌కు రండి!
కనీసం ‘పెట్టి’ కేసు కూడా లేని ఎంతో మందిని ఆధార్ కార్డులు తీసుకుని స్టేషన్‌లకు రావాలని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్న దుస్థితి ప్రస్తుతం నగరంలో దాపురించింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు? సమావేశాలకు ఎవరు వస్తున్నారు? కార్యక్రమాలకు అనుమతులు ఉన్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీలో తిరిగే వారిని ట్రబల్ మంగర్స్ పేరుతో బైండోవర్‌లు చేస్తున్నారని తెలుస్తోంది. రాజకీయ కార్యకలాపాల కారణంగా మాత్రమే వ్యక్తులను స్టేషన్లకు పిలిచి భయపెట్టడం సరికాదని వైఎస్సార్ సీపీ వర్గాలు అంటున్నాయి. గుంటూరు నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఐలు వారి కింద ఉన్న ఎస్‌ఐలు, సిబ్బంది ద్వారా క్రియాశీల వైఎస్సార్ సీపీ కార్యకర్తలను గుర్తించి స్టేషన్లకు పిలిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరికి నేరుగా ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారని, మరికొందరికి స్టేషన్‌కు రావాలని ఆదేశిస్తున్నారని తెలుస్తోంది.
ఎన్నికల ముందు భయపెట్టే వ్యూహం
కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ కదలికలు వేగం పుంజుకుంటున్న సమయంలో అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ శ్రేణులను భయపెట్టే ధోరణులు ఏ మాత్రం సబబు కాదని పలువురు పేర్కొంటున్నారు. అధికార యంత్రాంగం ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుతున్నారు.
ఎన్నికలకు ముందే ఆయా డివిజన్లలో వైఎస్సార్ సీపీలో క్రియాశీలంగా ఉన్న నాయకులు, కార్యకర్తల వివరాలను సేకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు? ఎవరు స్థానికంగా పార్టీని నడిపిస్తున్నారు? ఎవరు సమావేశాలు నిర్వహిస్తున్నారు? వంటి వివరాలను నిఘా వర్గాల ద్వారా సేకరించి పోలీస్ స్టేషన్లకు చేరవేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ జాబితా ఆధారంగా కొందరిని స్టేషన్లకు పిలిపించి ఒత్తిడి చేయటం, మాట వినని వారిపై బైండోవర్‌లు నమోదు చేయటం పరిపాటిగా మారింది. ఆఖరికి కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా ఫోన్‌లు చేసి స్టేషన్లకు రావాలని చెబుతున్నారని తెలుస్తోంది.
నగరంలోని పలు డివిజన్లలో వైఎస్సార్ సీపీ కార్యాలయాలు, వాటి వద్ద అనుమతులతో ఏర్పాటు చేసుకున్న పార్టీ జెండాలను కార్పొరేషన్ సిబ్బంది ద్వారా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పుకొంటున్నారు. అయితే అధికారులు కూటమి పా ర్టీల జెండాల వంక కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు. అదే వైఎస్సార్ సీపీ జెండాలైతే అన్ని అనుమతులు ఉన్నా.. ఏదో ఒక వంక చూపి తొలగింపు చర్యలు చేపడుతున్నారు. పార్టీ జెండాల విషయంలో నిబంధనలు ఉంటే వాటిని ముందుగానే స్పష్టంగా తెలియజేసి, నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని, ఏకపక్షంగా జెండాలు తొలగించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.


