అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో సోమవారం లోక కల్యాణార్ధం లక్షబిల్వార్చన అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా గణపతి, రుద్రహోమం నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణానంతరం సహస్ర నామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. బాలచాముండేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కొండవీడు కోటకు నో ఎంట్రీ
నేటి నుంచి 29 వరకు చెక్‌పోస్ట్ మూసివేత
యడ్లపాడు: తుపాను ప్రభావం నేపథ్యంలో పర్యాటక ప్రాంతమైన కొండవీడు కోట సందర్శనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొండవీడు ఫోర్ట్ చెక్‌పోస్ట్‌ను మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి ఈనెల 29 వరకు పర్యాటకులకు అనుమతి నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు, ప్రజలు ఈ మూడు రోజులూ కొండవీడు కోట సందర్శనకు రావద్దని అధికారులు సూచించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మంగళగిరి టౌన్: వాల్మీకి జయంతిని పురస్కరించుకుని సోమవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో వేడుకలు నిర్వహించారు. ఆరవ బెటాలియన్ కమాండెంట్ ఎ.మురళి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి జీవితాన్ని, ఆయన అందించిన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సాహిత్యానికి అపారమైన కీర్తిని తీసుకొచ్చిన వాల్మీకి మహర్షి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని గుర్తు చేసుకున్నారు. ఆయన రచనలు సమాజానికి నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవనం, సత్యనిష్ఠ, మానవతా దృక్పథం వంటి గొప్ప సందేశాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జీవితం, ఆయన సాహిత్యం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో మంచి విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో ధరలు భారీగా పెరిగాయి. వారం రోజులుగా దసరా పండుగ, యార్డుకి పసుపు రాకపోవడంతోపాటు అన్ సీజన్ కావడంతో యార్డులో అమ్మకాలు జరగలేదు. సోమవారం యార్డుకు పసుపు బస్తాలను రైతులు తీసుకు రావడంతో కొమ్ములు ధర గరిష్టంగా క్వింటాకు రూ.20,911, కాయలు ధర గరిష్టంగా క్వింటాకు రూ.20,000లకు కొనుగోలు చేశారు. తెలంగాణ నిజామాబాద్‌లో క్వింటాకు రూ.22,666 ఉంది. ప్రస్తుతం వ్వాపారానికి అన్‌సీజన్ కావడంతో ఎగుమతుల్లో కదలిక వచ్చి నెలకొన్న డిమాండ్‌తో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో వ్యాపారులకు మరింత లబ్ధి చేకూరనుంది. రైతుల దగ్గర ప్రస్తుతం పసుపు నిల్వలు లేవు. ఇదే విధంగా ధరలు నిలకడగా పంట చేతికి వచ్చే వరకు ధరలు ఉండాలని రైతులు కోరుకుంటుంన్నారు.
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 1న ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ బాలికల (మహిళలు) సాఫ్ట్‌బాల్ సెలక్షన్‌న్స్ జరుగుతాయని ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ సెక్రటరీ పి.సామంత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సీనియర్ బాలికల సెలక్షన్స్‌లో పాల్గొనే వారికి వయస్సుతో సంబంధం లేదన్నారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనే వారు ఒరిజినల్ ఆధార్ కార్డులు తీసుకుని రావాలన్నారు. ఈ సెలక్షన్‌న్స్‌లో ఎంపికై న వారు డిసెంబర్‌లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. పూర్తి వివరములకు 9666723772 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన కోరారు.


