వీవీఐపీల ఇలాఖా.. భద్రత ఇలాగా? | - | Sakshi
Sakshi News home page

వీవీఐపీల ఇలాఖా.. భద్రత ఇలాగా?

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

● పోలీసు నిఘా ఉన్న ప్రాంతాల్లోనే దుండగుల స్వైరవిహారం ● తాజాగా ర్యాపిడో డ్రైవర్‌పై దాడి.. రూ.35 వేల నగదు అపహరణ

మహానాడు ప్రాంతంలో రెండు నెలల్లో మూడు దోపిడీ ఘటనలు

తాడేపల్లి రూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నివాసాలు ఉన్న ప్రాంతం.. నిత్యం వీవీఐపీలు రాకపోకలు సాగించే మార్గాలు.. అడుగడుగునా పోలీసు నిఘా ఉంటుందని భావించే పరిసరాలు.. అయినా అక్కడ వరుస దారి దోపి డీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. వీఐపీల భ ద్రతకు ప్రాధాన్యం ఇచ్చే ప్రాంతాల్లో సామాన్యుల ప్రాణ, ఆస్తుల రక్షణకు భరోసా ఎక్కడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాడేపల్లి పరిసరాల్లో రెండు నెలల వ్యవధిలో మూడు దాడులు, దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నట్లు వెలుగులోకి రావడం పోలీసు నిఘా వ్యవస్థ పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున మహానాడు ప్రాంతానికి సమీపంలో ర్యాపిడో డ్రైవర్‌పై దాడి చేసి రూ.35 వేల నగదు దోచుకున్న ఘటన ఈ ఆందోళనను మరింత పెంచింది.

వీవీఐపీల ప్రాంతంలోనే బరితెగింపు!

తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహానాడు ప్రాంతం సమీపంలో ర్యాపిడో డ్రైవర్‌పై జరిగిన దాడి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అందిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రామకృష్ణ ర్యాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున విజయవాడ బస్టాండ్‌ నుంచి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి వచ్చి తిరిగి వెళ్తుండగా సీతానగరం సబ్‌స్టేషన్‌ వద్ద నలుగురు యువకులు అతడిని అడ్డగించినట్లు సమాచారం. అతడిపై దాడి చేసి, వద్ద ఉన్న రూ.35 వేల నగదును లాక్కున్నట్లు తెలుస్తోంది. బాధితుడి సెల్‌ఫోన్‌ ద్వారా ఫోన్‌పే చేయడానికి దుండగులు ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్య కారణంగా నగదు బదిలీ కాలేదని సమాచారం. అనంతరం ఫోన్‌ను తిరిగి ఇచ్చి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. బాధితుడు వెంటనే 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి సీతానగరానికి చెందిన పాత నేరచరిత్ర ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నిఘా ఉన్నా.. నేరాలు ఎలా ?

ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నివాసాలు ఉన్న తాడేపల్లి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, పోలీసు నిఘా సాధారణంగా కీలక అంశాలుగా ఉంటాయి. వీఐపీల రాకపోకలు, భద్రతా అవసరాల నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయినప్పటికీ తెల్లవారుజామున రాకపోకలు సాగించే వ్యక్తులు దాడులు, దోపిడీలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

గతంలోనూ దాడులు..

ఈ నెల 7వ తేదీన ప్రాతూరు కరకట్టపై ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి, కుంచనపల్లిలో వీఐపీలు నివాసముండే ప్రైవేట్‌ విల్లాల ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసిన ఘటన కలకలం రేపినట్లు సమాచారం. బాధితుడి నుంచి ఫోన్‌పే ద్వారా నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా అతడిని బెదిరించేందుకు గంజాయి ప్యాకెట్లు పెట్టి ఫొటోలు తీసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి దారి దోపిడీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా సుమారు రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి నివాసం వెనుకవైపు ఉన్న ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న ప్రేమజంటపై దాడి చేసి చెవి దుద్దులు, సెల్‌ఫోన్లు లాక్కెళ్లిన ఘటన జరిగింది.

ఆన్‌లైన్‌ పరిచయాల మాటున

దోపిడీ ముఠాలు

పోలీసుల విచారణలో ఆన్‌లైన్‌ పరిచయాలు, చాటింగ్‌ నేపథ్యంలో కొన్ని ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రాతూరు, సీతానగరం ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో బాధిత యువకులు స్వలింగ సంపర్కుల పరిచయాల కోసం ఉపయోగించే యాప్‌ ద్వారా ఇతరులతో చాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ర్యాపిడో డ్రైవర్‌ కూడా మహానాడుకు చెందిన ఓ యువకుడితో చాటింగ్‌ చేయగా, ఆ పరిచయం ద్వారా మరికొందరు వ్యక్తులు వ్యవహారంలోకి వచ్చి దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. వీవీఐపీలు నివాసం ఉండే ప్రాంతాల్లో దారిదోపిడీ ఘటనలు జరుగుతున్నా పోలీసులు నిద్రావస్థలో ఉండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement