వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యంగా పోలీసుల దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యంగా పోలీసుల దౌర్జన్యం

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యంగా పోలీసుల దౌర్జన్యం

ఫోన్లు చేసి మరీ స్టేషన్‌కు రావాలంటూ ఒత్తిళ్లు ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా కొంతమంది నేతలపై బైండోవర్లు పాలకులకు వత్తాసు పలుకుతున్న పోలీసుల తీరుపై విమర్శలు

టీడీపీ నేతల విషయంలో ఉదాసీనత

పట్నంబజార్‌: గుంటూరు నగరంలో కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. అసలు ఎన్నికల్లో జెండా పట్టుకుని ప్రచారం చేయకూడదనే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిందంటే... అధికార పార్టీ నేతలకు వారు పలుకుతున్న వత్తాసు అర్థమవుతోంది. ఎలాంటి కేసులు, క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని వ్యక్తులను సైతం స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేస్తున్న పరిస్థితి గుంటూరు నగరంలో ఏర్పడింది. ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగా వైఎస్సార్‌ సీపీలో చురుగ్గా ఉండే వారిని స్టేషన్లకు పిలిపిస్తూ బైండోవర్లు చేయడం పరిపాటిగా మారింది. బైండోవర్ల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం, అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొంటున్న నాయకులకు ఫోన్లు చేసి స్టేషన్‌కు పిలిపిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వైఎస్సార్‌ సీపీ జెండాలు పట్టుకోవద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రచారానికి వెళ్లాలా... స్టేషన్‌కు రావాలా?

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యతే. అయితే, ఆ చర్యలు చట్టబద్ధంగా, అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి. వైఎస్సార్‌ సీపీ నేతలనే పదేపదే స్టేషన్‌కు పిలుస్తూ, బైండోవర్ల పేరుతో ఒత్తిడి చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. కనీసం ఏ రోజూ పోలీస్‌ స్టేషన్‌ మెట్టు కూడా ఎక్కని వ్యక్తులను సైతం అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొన్నారనే నెపంతో స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేయడం ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో సైతం గత సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వల్ప వివాదాలు జరిగిన ఘటనలో సంబంధిత వ్యక్తులను పిలిపించి బైండోవర్లు చేసిన పోలీసులు, అదే ఘటనలో ఉన్న టీడీపీ వారిని రెండు రోజుల తర్వాత ‘సాక్షి’లో కథనం వచ్చిన అనంతరం పిలిపించి బైండోవర్లు చేశారు. ఇప్పటివరకు గుంటూరు ఈస్ట్‌ పరిధిలో సుమారు 159 మందిని బైండోవర్‌ చేయగా, వారిలో అధిక శాతం వైఎస్సార్‌ సీపీ నేతలే ఉన్నారనేది స్పష్టమవుతోంది.

వైఎస్సార్‌సీపీ జెండాలపైనే అభ్యంతరాలా?

రాజకీయ పార్టీలు తమ జెండాలు, గుర్తులతో ప్రచారం నిర్వహించడం ప్రజాస్వామ్యంలో సహజం. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవచ్చు. కానీ, వైఎస్సార్‌ సీపీ జెండాలు పట్టుకోవద్దంటూ పోలీసులు ఆదేశిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక పార్టీ ప్రచారంపై ఆంక్షలు విధించి, మిగిలిన పార్టీలకు స్వేచ్ఛనిస్తే పోలీసుల నిష్పక్షపాత ధోరణిపై ప్రశ్నలు తలెత్తుతాయి.

అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, వైఎస్సార్‌ సీపీ నేతల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని, అయితే ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఇప్పటికే పలుమార్లు సూచించాయి. ఎన్నికల వేళ పోలీసుల ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలి. బైండోవర్లకు కారణాలు, స్టేషన్‌కు పిలవడానికి అవసరమైన ప్రాతిపదిక, ప్రచార ఆంక్షలకు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా వెల్లడించాలి. ఇవేమీ పట్టించుకోకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ఎంత ముఖ్యమో, అన్ని పార్టీలు సమాన అవకాశాలతో ప్రచారం చేసుకునే వాతావరణం కల్పించడం కూడా అంతే ముఖ్యం. పోలీసులపై రాజకీయ పక్షపాత ఆరోపణలు బలపడకుండా, చట్టం ముందు అందరూ సమానమేనని తమ చర్యల ద్వారా నిరూపించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement