ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

నేడు పీఓలు, ఏపీఓలకు శిక్షణ

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌తోపాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిర్వహణపై సమాచారం, స్పందన తెలియజేస్తే అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఓటరు చీటీలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డివిజన్ల విభజన కారణంగా ఓటు ఎక్కడ ఉందో కొంత మందికి తెలియడం లేదని, దానిపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. ఇదే ఒరవడి కొనసాగితే ఎన్నికలు సాఫీగా సాగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీఆర్వో షేక్‌ ఖాజావలి, జీఎంసీ అదనపు కమిషనర్‌ ఐ.కిషోర్‌, వైఎస్సార్‌ సీపీ ప్రతినిధి వై పిచ్చిరెడ్డి, బహుజన సమాజ్‌ పార్టీ ప్రతినిధి వాసు తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌ లింక్‌లో

ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు

స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లింక్‌లో పరిశీలించుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. లింక్‌ను ఓపెన్‌ చేసి ఎలా చూడాలో రాజకీయపార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ అవకాశాన్ని ఓటర్లు అందరూ వినియోగించుకొని, ముందుగానే తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసేందుకు ఫొటో ఓటరు స్లిప్‌లు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా, జీఎంసీ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవలతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో డీ లిమిటేషన్‌ వలన కొంత మంది ఓటర్లు ఓటు హక్కు ఎక్కడ ఉందో సందిగ్ధావస్థలో ఉన్నట్లు పార్టీల ప్రతినిధులు తెలియజేశారన్నారు. ఇందుకుగాను క్యూ ఆర్‌ కోడ్‌ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు శుక్రవారం ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. వంద మీటర్ల దూరం విధిగా పాటించాలని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో వచ్చే వారికి టోకెన్‌లు జారీ చేయాలన్నారు. నామినేషన్లు పూర్తి అయ్యాక స్క్రూటినీకి సిద్ధం కావాలన్నారు. రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు మొదటి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శిక్షణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. శిక్షణకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సూచనల మేరకు, పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేయుటకు 24, 25వ తేదీలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటెషన్‌ కేంద్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని తెనాలి మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్‌ ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణమూర్తి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగ సాయికుమార్‌, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement