వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి ప్రజల ఆశీస్సులతో నగర సమగ్ర అభివృద్ధికి కృషి డివిజన్లలో హోరెత్తిన వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం అడుగడుగునా ఘనస్వాగతం పలికిన ప్రజలు
నెహ్రూనగర్: నగర ప్రజలు ఆశీర్వదించి మేయర్‌గా గెలిపిస్తే గుంటూరును అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తానని వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నగరంలోని పలు డివిజన్లలో వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఆమె విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాడికొండ శ్రీదేవి మాట్లాడుతూ గుంటూరు నగర సమగ్ర అభివృద్ధికి తాను నిరంతరం కట్టుబడి ఉంటానని తెలిపారు. ప్రజల ప్రాథమిక అవసరాలకు పెద్దపీట వేస్తూ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తానని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
డివిజన్లలో హోరెత్తిన ప్రచారం..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తూర్పు నియోజకవర్గ అబ్జర్వర్ నిమ్మకాయల రాజనారాయణ తదితరుల నేతృత్వంలో డివిజన్లలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రచార ర్యాలీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.


