నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులను అడ్డుకుంటూ నామినేషన్‌న్ పత్రాలను లాక్కోవడం, చింపివేయడం వంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులందరికీ రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయంలో క్రోసూరు, సత్తెనపల్లి, ముప్పాళ్ల, నకరికల్లు జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు నామినేషనన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద అధికార పార్టీకి చెందిన వ్యక్తులు గుంపులుగా చేరి ఇతర అభ్యర్థులను అడ్డుకుంటున్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి.రవిబాబు విమర్శించారు.


