సొంతూరులో జనసేన సమన్వయకర్త వైఖరిపై ఆగ్రహం మరో గ్రామం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన భార్య పోటీ సదరు నాయకుడి తీరు తెలుసుకున్నాక ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎమ్మెల్యే నక్కా అండతో అడ్డగోలుగా రాజకీయాలు ఇరు పార్టీల్లో నాయకులు, కార్యకర్తల తీవ్ర అసంతృప్తి
సాక్షి టాస్క్‌ఫోర్స్: బాపట్ల నియోజకవర్గం వేమూరు మండలం చావలి గ్రామ పంచాయతీలో కాపు సామాజికవర్గానికి ఆధిపత్యం ఉంది. వేమూరు జనసేన పార్టీ సమన్వయకర్త, సొసైటీ అధ్యక్షుడు ఊసా రాజేష్ సొంతూరు కూడా అదే. వేమూరు ఎంపీపీ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో సమన్వయకర్త కన్ను ఎంపీపీ పదవిపై పడింది. గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకటి జనరల్ మహిళకు, రెండోది ఎస్సీలకు రిజర్వు అయింది. జనసేనకు మద్దతు ఉన్న అక్కడ ఈయన వైఖరితో గెలిచే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు టీడీపీ సామాజికవర్గం ఆధిపత్యం గల పోతుమర్రు ఎంపీటీసీ స్థానం నుంచి తన భార్యతో నామినేషను వేయించారు. జనసేనకు ఆధిపత్యం కలిగిన చావలి గ్రామంలో కూటమిలోని టీడీపీ మద్దతు కూడా తీసుకోకుండా పార్టీని భూస్థాపితం చేసి, పొరుగు గ్రామం వైపు చూస్తున్న ఆ సమన్వయకర్త తీరుపై స్థానికంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ఆగడాలు అన్నీ ఇన్నీ కావంటారు గ్రామస్తులు. గ్రామంలోని ఎస్సీల చేత దరఖాస్తులు చేయించి, రుణాలు తీసుకుని దర్జాగా వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదేమని అడిగిన ఓ ఎస్సీ వ్యక్తితో వాగ్వాదానికి దిగి, అతడిపై చెప్పుతో దాడి చేయడంతో బాధితుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం జిల్లా కోర్టులో పెండింగులో ఉందని సమాచారం. గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) అధ్యక్ష పదవిని రాజేష్ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి. రూ.300కు విక్రయించాల్సిన ఎరువుల బస్తాను రూ. వెయ్యి చొప్పున బ్లాక్‌మార్కెట్లో అమ్మినట్లు రైతులు చెబుతున్నారు. సొసైటీలో రుణాల కేటాయింపునకు వసూళ్లకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కనీసం రూ.30 వేలు లంచమిస్తేనే రుణాలు మంజూరు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వని రైతులకు రుణాలు రాలేదు. పెరవలి సొసైటీ నుంచి మత్స్యకార సొసైటీలోకి వెళ్లిన చావలి గ్రామంలోని చెరువులో చేపలు పెంపకానికి లీజుకిచ్చారు. ప్రైవేటు వ్యక్తి లీజు హక్కు దక్కించుకున్నాడు. తనకు రూ.5 లక్షలు ఇస్తేనే చేపలు పట్టుకునేందుకు అనుమతిస్తానని రాజేష్ బెదిరించారు. చెరువులో రూ.15 లక్షల విలువైన చేపలున్నాయి. విధిలేని పరిస్థితిలో ఆ లీజుదారుడు ఆ మొత్తం ఇచ్చినట్లు తెలిసింది.
స్వార్థ రాజకీయం
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయి. వేమూరు ఎంపీపీ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఆ పదవిని దక్కించుకోవటానికి తన భార్యను పోటీ చేయించాలని ఉవ్విళ్లూరిన రాజేష్ గ్రామస్తులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం గ్రామస్తులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లకు దొరికాడని అనుకున్న గ్రామస్తులు ఎలాగైనా అతడిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. విందు భోజనాల మంత్రాంగం పనిచేయదని తెలుసుకున్న సదరు నాయకుడు మూడు రోజుల తర్వాత సామూహిక భోజనాలను నిలిపివేశారు. చావలికి ప్రత్యామ్నాయంగా సురక్షిత స్థానం కోసం అన్వేషించారు. జనరల్ మహిళకు రిజర్వయిన, టీడీపీ నాయకుల ఆధిపత్యం కలిగిన పోతుమర్రు ఎంపీటీసీ స్థానానికి తన భార్యతో నామినేషను దాఖలు చేయించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆశీర్వాదంతో ఈ పని చేశారు. సొంత ఊరు చావలిలో ఆధిపత్యం గల జనసేనను భూస్థాపితం చేసి, పోతుమర్రు ఎంపీటీసీగా భార్యను పోటీ చేయిస్తున్న రాజేష్ వ్యవహారశైలి, లంచగొండితనం తెలిసిన ఆ మూడు గ్రామాల ఓటర్లు కూడా మద్దతు ఇవ్వబోమని ఇప్పటికే తేల్చిచెప్పారని సమాచారం. ఈ పరిణామంతో చావలిలోని టీడీపీ వర్గీయులు సైతం తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. అవకాశం ఉంటే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సమక్షంలో జనసేన పార్టీలో చేరదామనే భావనలో ఉన్నారని తెలిసింది.


