గుంటూరు మెడికల్: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్‌కేబీఎం మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల సక్రమ నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తడి–పొడి వ్యర్థాలను వేరు చేయడం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించారు. జిల్లా పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా పరిశుభ్రతను ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక బాధ్యతగా, అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌కేబీఎం మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఖాజావలి, ఐటీసీ ఎంఎస్‌కే ఫినిష్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ కె.నారాయణ, పర్యావరణ విద్యా కోఆర్డినేటర్ బి.తిరుపతిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ (పెదకాకాని): ఏఎన్‌యూలో సాంసంగ్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో డేటా ప్రో కంప్యూటర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. ఏఎన్‌యూలో 70 రోజులు పాటు నిర్వహించే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం మాట్లాడుతూ విద్యార్థులు ఇందులో నైపుణ్యాలను మెరుగుపరచుకొని భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను అందుపుచ్చుకోవాలన్నారు. డేటా ప్రో డీజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సాంసంగ్ నుంచి రూ.లక్ష నగదు బహుమతి అందిస్తారని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ లింగరాజు, అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.గోపీకృష్ణ, డాక్టర్ డి.చంద్రమౌళి, సీఎస్సీ కో ఆర్డినేటర్లు డాక్టర్ కె చైతన్య, యు.సతీష్ కుమార్, డేటా ప్రో ప్రోగ్రాం మేనేజర్ ఉమామహేశ్వరరావు, ట్రైనర్ బి. నిస్సి పాల్గొన్నారు.


