రూ.127.86 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఎన్నికలు నిర్వహించి పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్
మంగళగిరి టౌన్: రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, పరిపాలనా సమస్యలను తక్షణమే పరిష్కరించి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళగిరి నగర పరిధిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావులను కలసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. మంగళగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రతినిధి సాంబశివరావును కలసి కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధమైన పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ, అమ్మకాలపై రిబేట్ తదితర పథకాల కింద రావాల్సిన సుమారు రూ.127.86 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏపీకో నుంచి కొనుగోలు చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.90.53 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కమిటీ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, రామనాథం పూర్ణచంద్రరావు, కాసుల రవికుమార్, బండారి మస్తాన్, డోకిపర్తి రామారావు, కౌతవరపు వెంకటేశ్వరరావు, గోలి రవికుమార్, భీమిశెట్టి బాలతీడేరు, అవ్వారు సుబ్రహ్మణ్యం, ఊట్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


