పోలీసులకూ ‘సినిమా’ చూపెడుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

పోలీసులకూ ‘సినిమా’ చూపెడుతున్నారు!

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

బందోబస్తులతో ఇక్కట్లు..

ఘంటసాల ప్రీవ్యూ షో టికెట్లు

విక్రయించాలంటూ ఆదేశాలు

ఒక్కో స్టేషన్‌కు 50 టికెట్లు

పంపిన ఉన్నతాధికారులు

మరోవైపు కూటమి నాయకుల

ఇండెంట్‌లతో సతమతం

లక్ష్మీపురం: ప్రజా సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించే పోలీసులకు కూటమి నేతల తీరుతో సినిమా కష్టాలు తప్పడం లేదు. ఇటు ప్రజలకు, అటు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు రక్షణ కల్పించేందుకు నిరంతరం కృషి చేసే పోలీసులపై కూటమి నాయకుల వేధింపులు, ఇండెంట్‌లతో భారం పడుతోంది. ఉన్నతాధికారుల హుకుంలు కూడా తోడవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల కొంత కాలంగా కనీవినీ ఎరుగని రీతిలో పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీస్‌ స్టేషన్‌లలో పుస్తకాలు, సినిమా టిక్కెట్లు విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. హరిహర మహల్‌ థియేటర్‌లో శనివారం ఉదయం 8.30 గంటలకు ఘంటసాల ప్రీవ్యూ షోకి సంబంధించిన టికెట్లను గుంటూరు నగరంలో ఉన్న ఆరు పోలీస్‌ స్టేషన్‌లకు పంపారు. పోలీస్‌ బాస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీటిని విక్రయించాలంటూ మౌఖిక ఆదేశాలను జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో టికెట్‌ ధర సుమారు రూ.100కు పైగా ఉందని, ఆ టికెట్లు ఎవరికి విక్రయించాలంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించక తప్పడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం న్యాయశాఖకు సంబంధించిన పుస్తకాలను పోలీస్‌ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు కొనుగోలు చేయాలంటూ ఆయా పోలీస్‌ స్టేషన్‌లకు పంపించారు. వాటి విలువ సుమారు రూ.2 వేలకు పైగా ఉందని అంటున్నారు. అసలు పోలీసు శాఖలో ఎప్పుడూ లేని విధంగా సినిమా టికెట్లు, పుస్తకాలు విక్రయించడం సరికాదని కొందరు పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. పోలీస్‌ బాస్‌ ఆదేశాలకు భయపడాల్సి వస్తోంది.

కూటమి నేతల జులుం

ఇదంతా ఒక ఎత్తు అయితే, పోలీసు శాఖను సైతం కూటమి నాయకులు ఇండెంట్‌లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పోలీసుల జేబులు ఖాళీ అవుతున్నాయని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆయా పోలీస్‌ స్టేషన్‌ల సీఐ, ఎస్‌ఐల చేత కార్లు, బొకేలు, శాలువాలు, భోజనాలు అంటూ ఇండెంట్‌లు వేస్తున్నట్లు సమాచారం. మరో వైపు పోలీసులను ప్రజల ముందు అవమానించేలా ప్రజా ప్రతినిధులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, పోలీస్‌ స్టేషన్‌లలో పోస్టింగ్‌ల కోసం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి సిఫారసులు తీసుకోక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. దానికి సైతం ముడుపులు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. బదిలీ అయ్యేంత వరకు సంబంధిత ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో విధులు నిర్వహించడంతో పాటు, వారి అవసరాలకు ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదని అంటున్నారు.

పోలీస్‌ శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు మరో వైపు పీజీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఫిర్యాదులను, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సిఫారసులను పరిష్కరించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు పోలీసులను బందోబస్తులకు కేటాయించడంతో సామాన్య ప్రజలకు స్టేషన్‌లో సకాలంలో న్యాయం అందడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement