తెనాలిరూరల్: తెనాలి–విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు సమీపంలో శనివారం ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. తెనాలి నుంచి మంగళగిరి వైపు కారు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసున్న మహిళ కారు నడుపుతూ వస్తుండగా వేగం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
నేడు రాజధాని రైతులతో మాటామంతీ
తాడేపల్లి రూరల్: రాజధాని రైతులతో మాటామంతీ కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఉండవల్లి గ్రామ అధ్యక్షుడు మున్నంగి శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి రైస్‌మిల్లులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి, రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌కుమార్, రిటైర్డ్ నీమ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, సామాజికవేత్త డాక్టర్ వసుంధర తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమానికి రాజధాని రైతులు, రైతులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.


