కిడ్నాప్‌ చేశాక బాలికకు చిత్రహింసలు | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ చేశాక బాలికకు చిత్రహింసలు

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి జాన్‌ సైదా నిజస్వరూపం తొలుత ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు నమ్మించి కిడ్నాప్‌ చేశాక 230 గ్రాముల బంగారం విషయంలో వేధింపులు తట్టుకోలేక మైనర్‌ ఇన్‌స్టా కాల్‌ చేసినా చూడని కుటుంబ సభ్యులు అప్పటికే హైకోర్టును ఆశ్రయించడంతో చురుగ్గా పోలీసు దర్యాప్తు ఎట్టకేలకు నిందితుడు, సహకరించిన తల్లి, సోదరి కటకటాలపాలు బంగారం రికవరీ కోసం పోలీసుల ప్రయత్నాలు

లక్ష్మీపురం: గుంటూరు నగరంలో మైనర్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్టు అయిన రబ్బానీ అసలు నైజం తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాలికను బెదిరించినట్లు వెల్లడైంది. నమ్మించి కిడ్నాప్‌ చేశాక ఆమెను చిత్రహింసలు పెట్టినట్లు తేలింది. ఆమె తెచ్చిన 230 బంగారం కాజేయడానికి ఆమెను వేధించినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. సేకరించిన సమాచారం మేరకు... పర్చూరు వద్ద దగ్గుపాడుకు చెందిన షేక్‌ జాన్‌ సైదా అలియాస్‌ రబ్బానీ అలియాస్‌ పండుకు తల్లి, సోదరి ఉన్నారు. ఎక్కువగా జులాయిగా తిరుగుతూ ఉండే అతడు రెండు సంవత్సరాల క్రితం గుంటూరు నగరానికి చెందిన ఓ మైనర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడు. స్నేహం నటించాడు. ఎలాగైనా బాలికను లొంగదీసుకునేందుకు తల్లి, సోదరితో కలిసి పథకం వేశాడు. వీడియో కాల్‌ చేసి ప్రేమించని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఓ గ్లాసులో ఉంచిన ద్రావణం తాగాడు. రబ్బానీ తల్లి, సోదరి వెంటనే వీడియో కాల్‌లోకి వచ్చి బాలికపై ఒత్తిడి చేశారు. ప్రేమిస్తున్నానని చెప్పకపోతే రబ్బానీ చనిపోతాడని భయపెట్టారు.

నగదు, నగలతో మకాం మారుస్తూ...

అనంతరం ఆమెను మాయమాటలతో ట్రాప్‌ చేసి జూన్‌ 9న రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి నుంచి తీసుకెళ్లాడు. సుమారు 230 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష కూడా ఆమె తీసుకొచ్చేలా చూశాడు. తొలుత నెల్లూరు తదితర ప్రాంతాల్లో తిరిగాడు. అదే రోజు రాత్రి బాలిక తండ్రి పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కానీ పోలీసులు దర్యాప్తు చేయలేదు. ఈ నేపథ్యంలో బాలికతో రబ్బానీ హైదరాబాద్‌ వెళ్లినట్లు తేలింది. అక్కడ రబ్బానీ మేనత్త వద్దకు వెళ్లినట్లు తెలిసింది. ఆమె భర్త గతంలో మృతి చెందాడు. ఇప్పుడు ఓ ఆశ్రమంలో పని చేస్తోంది. రబ్బానీతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బాలిక విషయం గురించి తనకు పూర్తిగా తెలియదని, రబ్బానీ వద్ద ఎప్పుడూ కత్తి ఉంచుకుని భయపెడుతూ ఉండేవాడని చెప్పింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే బంగారం విక్రయించాడని తేలింది. తర్వాత బాలికతో పలు నగరాల్లో తిరిగాక హరియాణాలోని కర్నాల్‌ అనే ప్రాంతానికి రబ్బానీ వెళ్లాడు. అక్కడ మూడు ద్విచక్ర వాహనాలు, ఇల్లు అద్దెకు తీసుకుని ఫర్నీచర్‌ కొనుగోలు చేశాడు.

హోటల్‌లో చిత్రహింసలు..

బాలికను అంతకుముందే బెంగళూరు తీసుకెళ్లినప్పుడు ఓ హోటల్‌లో సుమారు నాలుగు రోజుల పాటు చిత్ర హింసలు పెట్టాడని పోలీసులు నిర్ధారించారు. బంగారం గురించి పోలీసులు అడిగితే బెంగళూరు పబ్లిక్‌ టాయిలెట్‌లో పెడితే కనిపించకుండా పోయాయని చెప్పాలని బెదిరించినట్లు కుటుంబ సభ్యుల ముందు బాలిక కన్నీరుమున్నీరుగా విలపించిందని తెలిసింది. ఆ వేధింపులు తాళలేక బాలిక ఆగస్టు 29వ తేదీన ఇన్‌స్టా నుంచి కుటుంబ సభ్యులకు కాల్‌ చేయగా వారు సెప్టెంబర్‌ ఒకటిన దానిని చూశారు. అప్పటికే ఆగస్టు 29న హైకోర్టును వారు ఆశ్రయించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆరా తీయగా హరియాణాలోని కర్నల్‌ అనే ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం వచ్చింది. పోలీసులు రబ్బానీని అదుపులో తీసుకుని, బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అరెస్టు అనంతరం రబ్బానీ, అతడి తల్లి, సోదరిని కూడా రిమాండ్‌కు తలించారు. విక్రయించిన బంగారం రికవరీ కోసం పట్టాభిపురం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీజ్‌ చేసిన మూడు ద్విచక్ర వాహనాలు, ఫర్నీచర్‌ను గుంటూరుకు తీసుకురావాలా? లేక సీజ్‌ చేసి అక్కడే ఉంచాలా? అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement