ఓటర్ ఐడీ, గ్యాస్ బిల్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఒకటి తప్పనిసరి ఒక వేళ ఉన్నా ఆ వివరాల్లో అధిక శాతం అన్నీ తప్పులే పాత కార్డులు ఉన్నా.. కొత్తవి కావాలంటూ తిరస్కరణ
ప్రత్తిపాడు: రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రకంగా పింఛన్ల మంజూరు సంఖ్యను దరఖాస్తు దశలోనే కుదించేందుకు పథకం పన్నినట్లుగా కనబడుతోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఇంట్లో సహజంగా ఉండే ఆధార్ కార్డు, రేషన్ కార్డులను అడ్రస్ ప్రూఫ్ జాబితాలో చేర్చలేదు. స్థానికతను నిర్ధారించుకునేందుకు అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడీ, గ్యాస్ బిల్లు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి తప్పనిసరన్న నిబంధనను విధించింది. దీంతో వృద్ధుల పరిస్థితి ఆదిలోనే హంసపాదులా తయారైంది. కేవలం ఆధార్‌ను ఆధార్ హిస్టరీ అప్‌లోడ్ చేసేందుకు, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌కు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ అవ్వక..
ఇటీవల సర్ ప్రక్రియతోపాటు అంతకుముందు జరిగిన సవరణల్లో ఓటర్ ఐడీ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసినట్లు మొన్నటి వరకు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఓటర్ ఐడీ కోసం కార్యాలయాలకు వెళ్తున్న వారికి ఇంకో సమస్య ఎదురవుతోంది. కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కాలేదని, ముందు కార్డు లింక్ చేయించుకోవాలని ఉచిత సలహాలిచ్చి వెనక్కు పంపిస్తున్నారు. దాదాపుగా సగం మందికి ఫోన్ నంబర్‌తో అనుసంధానం కాలేదని తెలుస్తోంది. ఇవి కాక ఆధార్ కార్డులకు లింక్ అయిన మొబైల్ నంబర్లు, ఓటీపీలు, కరెంటు బిల్లులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా సమర్పించాల్సిన పత్రాలెన్నో ఉన్నాయి. వీటన్నింటినీ తీసుకుని స్వర్ణ గ్రామ కార్యాలయాలకు వెళ్లడానికి దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక దరఖాస్తుకే ఇలా ఉంటే విచారణ తర్వాత ఎన్ని మంజూరవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను పరిశీలించి, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు.
వాస్తవానికి స్థానికతను నిరూపించుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నాలుగింటిలో మూడు ప్రూఫ్‌లు వృద్ధుల వద్ద ఉండే అవకాశమే లేదు. పాస్‌పోర్టు విదేశాలకు వెళ్లే వారి వద్ద లేదా కొద్దో గొప్పో ఆర్థిక స్థోమత ఉన్న వారి వద్ద మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే కచ్చితంగా 95 శాతం మంది వృద్ధుల వద్ద ఉండే అవకాశమే లేదు. డ్రైవింగ్ లైసెన్స్ 60 ఏళ్ల పైబడిన కర్ర లేనిదే కాలు బయట పెట్టలేని వృద్ధుల వద్ద ఉండటం చాలా అరుదు. మొదటి నుంచి మోటార్ ఫీల్డ్‌లో ఉన్న అతికొద్ది మంది వద్ద మాత్రమే ఉండే వీలుంది. మొత్తమ్మీద ఐదు, పది శాతం మంది వద్ద కూడా ఉండని పరిస్థితి. మూడవది గ్యాస్ బిల్లు. మలి వయస్సులో కొడుకులు, కుమార్తెల వద్ద ఉండే వృద్ధుల పేరుతో గ్యాస్ బిల్లు ఉండటం అంటే సాధ్యమయ్యే పని కానే కాదు. ఓటర్ ఐడీ అనేక మంది వృద్ధులకు ఉన్నా అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవేళ పాత కార్డు దొరికినా ఇప్పుడు పది అంకెలతో ఉండే కొత్త కార్డు కావాలని మెలిక పెడుతున్నారు.


