సినీ దర్శకుడు బోయపాటి ఏఎన్‌యూలో అలరించిన మ్యూజికల్ నైట్ ఘనంగా కొనసాగుతున్న స్వర్ణోత్సవాలు
ఏఎన్‌యూ(పెదకాకాని): విద్యార్థులు నైపుణ్యాల పెంపుతో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఏఎన్‌యూ పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి దర్శకుడు బోయపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞత, సంస్కారం, లౌక్యం, బాధ్యతాయుతమైన లక్షణాలను అలవరచుకోవాలని సూచించారు. తాను ఏఎన్‌యూ పూర్వ విద్యార్థినని, విశ్వవిద్యాలయం అందించిన సర్టిఫికెట్ తన సినీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. తనను ప్రముఖ సినీ దర్శకుల స్థాయిలో నిలబడటానికి అది దోహదపడిందన్నారు. సమాజంలో క్రమక్రమంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా, వాటిని అవసరమైన మేరకే వినియోగించాలని హితవు పలికారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రెక్టార్ ఆచార్య శివరాం, ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం తదితరులు ప్రసంగించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం అందించిన సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. పాటలు, నృత్యాలతోపాటు విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఆద్యంతంగా ఉత్సాహంగా కనిపించారు.
ఉత్సాహంగా 5కే వాక్
ఏఎన్‌యూ స్వర్ణోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన 5కే వాక్ ఉత్సాహంగా సాగింది. క్రీడా మైదానంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలంలు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్, అనంతరం సర్వీస్ రోడ్డు మీదుగా కంతేరు అండర్ బ్రిడ్జి, ఆనందజ్యోతి మీదుగా విశ్వవిద్యాలయ ప్రధాన గేటుకు వాక్ చేరుకుంది. తిరిగి క్రీడా మైదానానికి వెళ్లింది. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


