కాంట్రాక్టర్ పనుల రద్దు, డిపాజిట్ల జప్తు ఉత్తర్వులు కొట్టివేత షోకాజ్ నోటీసు లేకుండా వ్యవహరించడంపై ఆగ్రహం ఆరు వారాల్లోగా ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆదేశం
తీవ్ర వ్యాఖ్యలు
నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంట్రాక్ట్ పనులను రద్దు చేసి, డిపాజిట్లను జప్తు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి జీఎంసీ కమిషనర్ జారీ చేసిన ఏకపక్ష ఉత్తర్వులను కొట్టివేసింది. బాధితుడి డిపాజిట్ మొత్తాన్ని ఆరు వారాల్లోగా తిరిగి చెల్లించాలని జస్టిస్ హరినాథ్.ఎన్ తీర్పు వెలువరించారు.
అసలేం జరిగిందంటే..
నల్లచెరువుకు చెందిన ‘దిరిసాల శ్రీనివాసరావు’ ఏజెన్సీ గతంలో (2017–18, 2019–20) ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్లలో పోర్టల్ డేటాను, రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిందని జీఎంసీ ఆరోపించింది. నాయుడుపేట డ్రెయిన్లు, చంద్రబాబు నాయుడు కాలనీ రోడ్డు, క్రిస్టియన్ పేట యూజీడీ పనుల్లో పోర్టల్ శాతాలకు, ఎల్వోఏ రిజిస్టర్‌కు మధ్య భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో సదరు ఏజెన్సీకి సంబంధించి గుండారావుపేట, బండ్ల బజార్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ పరిసరాల్లో చేపట్టిన రూ. 2.02 కోట్ల విలువైన ఆరు సివిల్ పనులను రద్దు చేస్తూ, ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేస్తూ జీఎంసీ కమిషనర్ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావుతో పాటు మరికొంత మంది కాంట్రాక్టర్లు కూడా ఇదే జాబితాలో ఉన్నారు.
జీఎంసీ చర్యను సవాల్ చేస్తూ కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది అనంత వాదనలు వినిపించారు. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండా డిపాజిట్లు జప్తు చేయడం చట్టవిరుద్ధమని కోర్టుకు విన్నవించారు. ఉభయ పక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి.. పాత పనుల్లో అక్రమాలు జరిగాయన్న నెపంతో కొత్త టెండర్లను రద్దు చేయడం, డిపాజిట్లను జప్తు చేసే అధికారం జీఎంసీకి లేదని స్పష్టం చేశారు. కమిషనర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని పేర్కొన్నారు. వివాదాస్పద ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా రద్దు చేశారు. పిటిషనర్‌కు సంబంధించిన ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్‌ను తీర్పు ప్రతి అందిన ఆరు వారాల్లోగా రీఫండ్ చేయాలని జీఎంసీని ఆదేశించారు.


