ప్రాచీన భారతీయ సంస్కృతికి దర్పణం శాసీ్త్రయంగా నిరూపితం సాధన చేస్తే మేధస్సుకు పదును, ఆలోచనా శక్తి వృద్ధి విద్యార్థులకు అందుబాటులో వేదిక్ మ్యాథ్స్ పుస్తకాలు జాతీయస్థాయిలో రాణించేందుకు ఆయుధం
ఎన్నెన్నో ప్రయోజనాలు..
గుంటూరు ఎడ్యుకేషన్: వేద గణిత విజ్ఞాన శాస్త్రం శాసీ్త్రయ నామం వేదిక్ మ్యాథ్స్. కఠినమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే ప్రాచీన విధానం. పాఠశాల స్థాయి నుంచి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఒక అస్త్రం. తల్లిదండ్రులు శిక్షణ సంస్థల కోసం అన్వేషిస్తున్నారు. పదో తరగతి తరువాత ఇంటర్‌తోపాటే విభిన్నమైన పోటీ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. గణితం ఆధారంగా ప్రతిభ చూపాల్సిన విద్యార్థులకు వేద గణితశాస్త్రం ఆయుధంగా మారింది.
వేదిక్ మ్యాథ్స్ అంటే..
పూరి పీఠాధిపతి జగద్గురు భారతీకృష్ణ తీర్థస్వామి 1957లో రాసిన వేదిక్ మ్యాథ్స్ పుస్తకం ద్వారా వేద గణితశాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చారు. వేదాల్లోని పలు సూత్రాలు, సిద్ధాంతాల ఆధారంగా ఆయన రూపొందించిన గణిత పద్ధతులు ఇందులో ఉన్నాయి. పుస్తకంపై ముద్రణా హక్కులు పొందిన ఢిల్లీకి చెందిన మోతీలాల్ బనారసీ దాస్ పబ్లిషర్స్ ఈ పుస్తకం ప్రచురించింది. ప్రస్తుతం మార్కెట్లోని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో ఒరిజినల్ ఎడిషన్ దొరుకుతోంది.
వేదాల నుంచి ...
వేద గణితం అంటే వేదాల నుంచి ఆవిర్భవించిన విజ్ఞానం. ఇందులో 16 సూత్రాలు, 13 ఉప సూత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా గుణాకారాలు, భాగాహారాలు, కారణాంక విభజన, దశాంశ భిన్నాలు, పాక్షిక భిన్నాలు, ఆవర్తన దశాంశాలు, వర్గాలు, ఘనాలు, ఘనమూలాలు, బీజగణిత సమస్యలకు సులువుగా సమాధానం చెప్పవచ్చు. సింగిల్ లైన్ జవాబుగా మౌఖికంగా చేసే పద్ధతులు, కాలిక్యులస్, త్రికోణమితి వంటి పరిశోధనాంశాలు ఉన్నాయి.
విదేశాల్లో ఒక సబ్జెక్టు
మనదేశంలో పుట్టిన వేద గణితశాస్త్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. లండన్, హాలెండ్ దేశాల్లో ఇది తప్పనిసరి సబ్జెక్టు. విద్యార్థుల ఆసక్తి మేరకు స్వల్పకాలిక వ్యవధిలో శిక్షణ కల్పిస్తుండగా, పూర్తిస్థాయిలో సబ్జెక్టుగా బోధించాలని గణిత మేధావులు కోరుతున్నారు. వేద గణితం అనగానే ఒక మతానికి సంబంధించిన విషయం అనుకుంటారు. అది తప్పు. భారతీకృష్ణ తీర్థస్వామి తన పుస్తకానికి పెట్టుకున్న పేరే తప్ప, ఇందులో ఉన్నదంతా గణిత విజ్ఞానమే. అసలు వేద గణిత శాస్త్రాన్ని బోధించగలిగే ఉపాధ్యాయులు సైతం వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నారు. వేద గణితంలో కఠిన లెక్కలను సైతం సులభంగా చేయగల నేర్పరితనం అలవడుతుంది. చిరు ప్రాయంలోనే శిక్షణ పొందితే, ఎదిగే కొద్దీ వేద గణితంపై పట్టు నిలుపుకుని అద్భుతాలు ఆవిష్కరించగలరు.
వేద గణితశాస్త్రాన్ని సాధన చేయడం ద్వారా మేధస్సు వృద్ధి చెందుతుంది. క్లిష్టమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే నైపుణ్యం అలవడుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ అర్హత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగకరం. గణితంలో అవధానాలు చేయాలనుకునే వారికి వేద గణితం తప్పనిసరి. వేదిక్ మ్యాథ్స్‌ను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని గణితశాస్త్ర మేధావులు కోరుతున్నారు. అబాకస్ శిక్షణ కల్పిస్తున్న పలు సంస్థలు వేదిక్ మ్యాథ్స్‌ను కూడా బోధిస్తున్నాయి. విశ్వ పునర్నిర్మాణ్ సంఘ్, రాష్ట్రీయ వేద ప్రతిష్ఠాన్, స్పిరిట్యువల్ స్టడీస్ గ్రూప్, విద్యాభారతి, వేద భారతి మొదలైన సంస్థలు దేశవ్యాప్త శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. వేద భారతి ఇంటర్నెట్ ద్వారా శిక్షణ ఇస్తోంది. ఒరిజినల్ పుస్తకాన్ని ముద్రించిన సంస్థ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించేందుకు వీలుగా పలు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది.


