వింటే ఓకే.. లేకుంటే వేటే! | - | Sakshi
Sakshi News home page

వింటే ఓకే.. లేకుంటే వేటే!

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

వింటే ఓకే.. లేకుంటే వేటే!

స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీ ఒంటెత్తు పోకడలు నిబంధనలకు విరుద్ధంగా 10 మంది స్టాంప్‌ వెండార్ల సస్పెన్షన్‌ ఉన్నతాధికారుల మాటలు బేఖాతర్‌ జిల్లాలో ఈ–స్టాంపుల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైనం

ఇలాంటి వ్యవస్థ ఎప్పుడూ చూడలేదు

కృత్రిమ కొరత సృష్టించి..

గుంటూరు వెస్ట్‌: సాఫీగా సాగిపోతున్న పనులను చెడగొట్టడంలో చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటే. ఈ–స్టాంపులను సరఫరా చేసే స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీ ఒంటెత్తు పోకడల కారణంగా జిల్లాలో ఈ–స్టాంపుల కృత్రిమ కొరత ఏర్పడింది. తాము చెప్పినట్లు వ్యాపారం చేయకపోతే స్టాంప్‌ వెండార్ల లైసెన్స్‌లు తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఈ కంపెనీపై రాష్ట్రవ్యాప్తంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. దీంతో ఇటీవల ఈ–స్టాంపుల విక్రయాలు మందగించాయి. అయితే ఈ కంపెనీ ఈ–స్టాంప్‌ వెండార్లకు కొత్త నిబంధనలు విధించింది. డీఎస్‌డీ (డెఫిసిట్‌ ఈ–స్టాంప్‌ డ్యూటీ) అంటే రిజిస్ట్రేషన్‌ ఫీజులు, సర్వీస్‌ చార్జీలు వంటి వాటిని పెద్ద మొత్తంలో చెల్లిస్తేనే వెండార్లకు ఈ–స్టాంప్‌ పేపర్ల స్టేషనరీ సరఫరా చేస్తామని తెలిపింది. దీంతో వెండార్లు ఇది తమ పని కాదని, వచ్చిన వారికి మాత్రమే ఈ–స్టాంపులు విక్రయిస్తామని చెప్పడంతో ఆగ్రహించిన కంపెనీ అధికారులు గత రెండు నెలలుగా స్టేషనరీ సరఫరా నిలిపివేశారు. దీంతో వెండార్లు రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులను కలిసి సమస్యలను లిఖితపూర్వకంగా వివరించారు. దీనిపై ఆగ్రహించిన కంపెనీ ఒకే రోజు జిల్లాలో 10 మంది వెండార్ల లైసెన్సులను సస్పెండ్‌ చేసింది. రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రైవేటీకరిస్తామని జీవో నంబర్‌ 396 తీసుకొచ్చిన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, స్టాంప్‌ వెండార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏమిటీ స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీ..

గతంలో నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంపులు, ఫ్రాంకింగ్‌ స్టాంపులతోపాటు చలానా సదుపాయాలు కూడా ఉండేవి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవస్థ సాఫీగా సాగిపోతున్న తరుణంలో 2016 జూన్‌లో అప్పటి చంద్రబాబు సర్కార్‌ స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజులు, స్టాంపుల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయడం, ఆ మొత్తంలో కొంత కమిషన్‌గా తీసుకోవడం దీని ప్రధాన విధి. అయితే పైలట్‌ ప్రాజెక్ట్‌ దశలోనే ఉన్నతాధికారులు ఇందులోని లోపాలను గుర్తించడంతో ఈ వ్యవస్థ కొంత మందగించింది. మళ్లీ గత ప్రభుత్వం కొన్ని మార్పులతో ఈ వ్యవస్థను విస్తృత స్థాయిలో ప్రవేశపెట్టింది. అయితే మళ్లీ చంద్రబాబు సర్కార్‌ రావడంతో కథ మొదటికొచ్చింది. ప్రస్తుతం స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీ ఇష్టానుసారంగా వెండార్లపై అనధికార నిబంధనలు విధించడం, సస్పెండ్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఈ–స్టాంపుల భారీ కుంభకోణం జరిగింది. దీనిని ఇప్పటికే సీఐడీ విచారిస్తోంది. అయినా ప్రభుత్వం ఈ–స్టాంప్‌ విధానంపై విచారణగానీ, ఆడిటింగ్‌గానీ నిర్వహించడం లేదు.

చిన్న డినామినేషన్‌ స్టాంపులు విక్రయించకుండా అన్నీ పెద్దవే విక్రయించాలంటే ఎలా వీలవుతుంది? వెండార్‌ వద్దకు వచ్చి ఎంత విలువైన స్టాంపు కావాలంటే అదే విక్రయిస్తాం. రెండు నెలలుగా స్టేషనరీ ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ఒకేసారి 10 మంది వెండార్లను సస్పెండ్‌ చేశారు. ఇప్పటికే నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంపులకు ఓటీపీ విధానం తీసుకురావడంతో వాటిని ఎవరూ కొనడం లేదు. ఫ్రాంకింగ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

– బి. శ్రీనివాసరావు,

సీనియర్‌ స్టాంప్‌ వెండార్‌, గుంటూరు

గత నెల రోజులుగా జిల్లాలో ఈ–స్టాంపుల కొరత కొనసాగుతోంది. గుంటూరులోని అరండల్‌పేటలో స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీ కార్యాలయం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఈ కార్యాలయం నుంచే సరఫరా అవుతుంటాయి. అయితే ఇక్కడకు ఇటీవల అసిస్టెంట్‌ మేనేజర్‌గా వచ్చిన ఓ వ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వెండార్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు వాపోతున్నారు. ఆయనకు ఎదురుతిరిగితే లైసెన్స్‌ ఎగిరిపోతుందని చెబుతున్నారు. ఈ–స్టాంప్‌ వెండార్లకు సరిపడా స్టేషనరీ సరఫరా చేయకపోవడంతో రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. చిన్న డినామినేషన్ల స్టాంపులు వేస్తామంటే స్టేషనరీ సరఫరా చేయబోమని స్టాక్‌ హోల్డింగ్‌ సంస్థ అధికారులు చెబుతున్నారని వెండార్లు అంటున్నారు. చాలా మంది వెండార్లు చిన్న డినామినేషన్ల స్టాంపులు విక్రయించడం లేదు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement