విద్యాసంస్థల బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): శుక్రవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ విజయవంతం అయ్యిందని ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్‌ సమీర్‌, డీవైఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి వై. కృష్ణకాంత్‌ , ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌.కె. సుభాని, జిల్లా అధ్యక్షుడు జె.చైతన్య తెలిపారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, ఎన్‌టీఏ రద్దు చేయాలని, ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద యువతపై పోలీసుల అమానుష చర్యలు నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు ఈ బంద్‌ చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యాసంస్థల నుంచి బంద్‌కు అనూహ్య స్పందన వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రైవేట్‌ యూనివర్సిటీలు ముందుగానే సెలవులు ప్రకటించాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌– టీచర్స్‌ మీటింగ్‌ ఉండడంతో మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చారని తెలిపారు. వివిధ కళాశాలల బస్సులను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు ఇచ్చారని తెలిపారు. గుంటూరు నగరంలోని పలు విద్యా సంస్థలను విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెళ్లి మూసివేయించారని పేర్కొన్నారు.

ప్రశ్నించే విద్యార్థుల గొంతులను లాఠీలతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి బి. యశ్వంత్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు గనిరాజు, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు దుర్గప్రసాద్‌ నాయక్‌, నాయకులు యశ్వంత్‌, సాయి, అమృత, కిన్నెర, పింకి, ఉమామహేశ్వరరావు, జాషువా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement