గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలను రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పోటీలకు హాజరైన క్రీడాకారులను రామకృష్ణ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ పోటీలు రెండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతాయన్నారు. ముఖ్యంగా అండర్ 11, 13, 15 విభాగాలలో క్రీడాకారులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవడం విశేషమని తెలిపారు. అనంతరం చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షులు రంగబాబు, జిల్లా కమిటీ సభ్యులు మొకమటం వెంకట్, సతీష్ చంద్ర, బండారు రాము, బొచ్చు రమేష్, హరి పాల్గొన్నారు.


