దుర్గమ్మకు విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు విరాళాలు

Jul 6 2026 1:28 AM | Updated on Jul 6 2026 1:28 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ సమీపంలోని గుంటుపల్లికి చెందిన కంచర్ల బెనర్జీ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణకు అందజేసింది. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన వి.వీరప్రకాష్‌ కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందించింది. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడకు చెందిన వై.యోహిత్‌ పేరిట కుటుంబ సభ్యులు అమ్మవారి అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన వి.వి.మనుబ్రహ్మచారి అన్నదానానికి రూ. 1,00,116 విరాళం సమర్పించారు.

ఆలయ అభివృద్ధి పనులకు రూ. లక్ష విరాళం

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఇందుకూరి నరేష్‌కుమార్‌రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేసవస్త్రాలను అందించారు.

ఐక్యతతో సమస్యలకు

పరిష్కారం

భవానీపురం(విజయవాడపశ్చిమ): సంఘీయులంతా సంఘటితంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమని సీనియర్‌ రాజకీయ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంఘం కార్యవర్గ సమావేశం విజయవాడ భవానీపురంలోని కొండవీడు అకాడమీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, నాయకులు రెడ్డి సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యఅతిథి వేమారెడ్డి మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గానికి సంబంధించి జిల్లాకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం సరికాదని, రాష్ట్రంలో అందరూ కలిసి ఒక సంఘంగా ఉంటే మంచిదని సూచించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు, హోదాలకు అతీతంగా రెడ్డి సామాజికవర్గ సంక్షేమం కోసం వారి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన సంఘం డిమాండ్లను వివరించారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి పాలకమండలిని నియమించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో రెడ్డి విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాల (హాస్టల్స్‌) ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించాలని కోరారు. రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బిక్క నరసింహారెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు గజ్జెల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం గౌరవ సలహాదారు పులుగు సుశీల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement