ఎంపీ భాష్యంకు ఫ్యాప్టో ప్రతినిధుల వినతి
గుంటూరు ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) గుంటూరు జిల్లా చైర్మన్ కె.నరసింహారావు విన్నవించారు. ఈమేరకు ఆదివారం ఫ్యాప్టో జిల్లా ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణను కలసి వినతి పత్రం అందించారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. నరసింహారావు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం–2009, ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ను తప్పనిసరి అర్హతగా నిర్ణయించారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఐదేళ్లకు పైబడిన ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాలని, ఉద్యోగోన్నతులకు సైతం టెట్ అర్హత తప్పనిసరని, ఇందుకు 2028 ఆగస్టు 31 గడువుగా నిర్ణయించిందని వివరించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు విధి నిర్వహణతో పాటు టెట్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం కేటాయించడం ఆచరణలో ఎంతో క్లిష్టమని, టెట్‌ను తప్పనిసరి చేయడం వలన ఉపాధ్యాయులు సెలవులు తీసుకుని పరీక్షలకు సిద్ధమయ్యే పరిస్థితి ఏర్పడి, పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలు, విద్యార్థుల అభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో విద్యాహక్కుచట్టానికి సవరణలు చేసి, ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. భాష్యం రామకృష్ణను కలసినవారిలో ఫ్యాప్టో డెప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్, దాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, ఖలీద్, మేకల సుబ్బారావు పాల్గొన్నారు.


