ఆంధ్ర ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు మంగరాజు ఘనంగా ప్రజా నాట్యమండలి జిల్లా 9వ మహాసభ
తాడేపల్లిరూరల్: పాలకుల వైఫల్యాలను ప్రజానాట్యమండలి కళాకారులు తమ కళారూపాల ద్వారా ఎండగట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజానాట్య మండలి గుంటూరు జిల్లా 9వ మహాసభ తాడేపల్లి పట్టణ పరిధిలోని మేక అమారెడ్డి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మహాసభకు జిల్లా అధ్యక్షురాలు పద్మ అధ్యక్షత వహించారు. సంఘం జెండాను కళాకారులు కుప్పం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. మండలి రాష్ట్ర నాయకులు, రచయిత, గాదె సుబ్బారెడ్డి చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కళాకారులకు సామాజిక పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. విద్యార్థి, యువజన, రైతు, మహిళా ఉద్యమాలకు అండగా తమ గళం వినిపిస్తున్నారని తెలిపారు. కళాకారులు ప్రజల్ని చైతన్యవంతం చేయాలని కోరారు. అనంతరం కళాకారులు ఆయన కులము ఎంత కుటిలమైనదో, కుములుతున్న జాతిని అడుగు, మతము ఎంత మలినమైనదో, మండుతున్న చితులను అడుగు వంటి అభ్యుదయ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పిల్లల వైద్యులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర గాయకుడు జగన్, నాయకులు ఆర్‌వీ రాఘవయ్య, దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


