శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం

Mar 20 2026 8:19 AM | Updated on Mar 20 2026 8:19 AM

శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం బగళాముఖి ఆలయంలో ఉగాది వేడుకలు కోటప్పకొండలో ఉగాది వేడుకలు పిడుగు పడి వరికుప్ప దగ్ధం

అమరావతి: ఉగాది పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారికి గురువారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.దేవాలయ ఈవో సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వెంకటాద్రినాయుడు మండపంలో స్వామి వారిని ఉంచి శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం భక్తులందరికి ఉచితంగా పంచాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహించారు. ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కలకోట చక్రధర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలకు ప్రముఖ ప్రవచన కర్త ఎం.కృష్ణకిషోర్‌ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. ప్రముఖ పౌరాణికులు శ్రీహరి శర్మ పంచాంగ శ్రవణం గావించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పంచాంగ శ్రవణం విని ప్రసాదాలు స్వీకరించారు.

నరసరావుపేట రూరల్‌: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో గురువారం ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. పరాభవ నామ ఉగాది సందర్భంగా ఆలయంలో వేదపండితులకు సన్మానం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొండకావూరి సత్యనారాయణ, కొండకావూరి రామకృష్ణ, శ్రీరాముల రాజశేఖరశర్మలను సన్మానించి సంభావన అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు పిడుగు పడి ఓ వరికుప్ప దగ్ధమైంది. స్థానిక వీఆర్వో సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియటంతో బుద్ధాం గ్రామంలో నర్రా నాగరాజుకు చెందిన వరికుప్పపై పిడుగు పడి మంటలు ఎగశాయి. స్థానిక రైతులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి కుప్పను కల్లంలో ఆరబెట్టారు. రైతుకు సుమారు రూ.70వేల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement