తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై గురువారం ఉగాది పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి వారికి అభిషేక మహోత్సవం నిర్వహించామని, శ్రీ చిన్న జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఉగాది పంచాగ శ్రవణం, సంపూర్ణ రామాయణ పారాయణ ప్రారంభం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం శ్రీరామనామ లేఖనం, శ్రీరామపూజ, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమాలు వైభవంగా ముగిశాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.


