అకాలవర్షం, ఈదురు గాలులకు తెనాలి నియోజకవర్గంలో పలుచోట్ల పైర్లు నేలకొరిగాయి. తెనాలి ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు వీచి, అక్కడక్కడా వర్షం కురిసింది. మళ్లీ గురువారం కూడా భారీ వర్షం వచ్చింది. చిత్రంగా ఒక ఊళ్లో వర్షం కురుస్తున్న సమయంలో మరో ఊరిలో చిన్న జల్లు కూడా పడలేదు. అకాల వర్షాలకు రైతులు బెంబేలెత్తారు. ఈదురు గాలులకు కొన్నిచోట్ల అరటి చెట్లు విరిగిపడ్డాయి. ప్రస్తుతం జొన్న పైరు కోతలు జరుగుతున్నాయి. చేలల్లో ఉన్న కంకులు వర్షానికి తడిచాయి. మరో మూడు వారాల్లో కోతకు రానున్న మొక్కజొన్న పైరు పలుచోట్ల నేలవాలింది. మరోసారి భారీ వర్షం కురిస్తే జొన్న, మొక్కజొన్నకు నష్టం తప్పదని రైతులు ఆందోళన పడుతున్నారు. మెట్టలో సాగుచేసిన పసుపు పైరును ఇప్పుడు దున్నుతున్నారు. ముందుగా దున్నిన రైతులు పసుపును వండి ఆర బెట్టే పనిలో ఉన్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే పసుపు రైతులు నష్టపోక తప్పని పరిస్థితి. – తెనాలి/కొల్లిపర


