చేబ్రోలు: పరిశోధనల్లో జంతువుల వినియోగం విషయంలో ఎథికల్ గైడ్‌లైన్స్‌ను కచ్చితంగా పాటించడం అవసరమని ఢిల్లీలోని సీసీఎస్‌ఈఏ సీనియర్ కన్సల్టంట్ డాక్టర్ వివేక్ త్యాగి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీసీఎస్‌ఈఏ (కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్‌విజన్ ఆఫ్ ఎక్సిపెరిమెంట్స్ ఆన్ యానిమల్స్) ఆర్థిక సౌజన్యంతో ‘‘రీడిఫైనింగ్ ఎక్సిపెరిమెంటల్ ఫార్మాకాలజీ’’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్ శనివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ‘‘ఎథికల్, ఆల్టర్‌నేటివ్ అండ్ డిజిటల్ ఫ్రాంటియర్స్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. డాక్టర్ వివేక్ త్యాగి మాట్లాడుతూ పరిశోధనల కోసం ప్రయోగ జంతువులను ఉపయోగించే సందర్భంలో జంతు సంక్షేమాన్ని కాపాడడం అవసరం అన్నారు. హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్. హరీష్ శంకర్ మాట్లాడుతూ వైద్యశాస్త్రం, ఫార్మకాలజీ మరియు జీవశాస్త్ర పరిశోధనల్లో జంతు నమూనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ అనేక రోగాలపై పరిశోధనలు చేయడంలో జంతు నమూనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. 350 మందికిపైగా విద్యార్థులకు నిర్వహించిన ఓరల్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్‌లలో సత్తా చాటిన వారికి బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జే. మహేష్ కుమార్, సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే. సురేష్ బాబు, బెంగళూరులోని దయానంద్ సాగర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విజయ్ కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


