గుంటూరు ఎడ్యుకేషన్ : పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత విద్యా బాటలు వేసిన కమ్మ హాస్టల్ సేవలు 102 వసంతాల మైలురాయిని చేరుకోవడం గొప్ప విశేషమని, విద్యార్థులు అంకుర పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. శనివారం అరండల్ పేటలోని కమ్మ విద్యార్థి సహాయ సంఘం (కమ్మ హాస్టల్) 102 వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.15 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘శ్రీ యలమంచిలి జనార్దనరావు కంప్యూటర్ ల్యాబ్’’ ను సుజనా చౌదరి ప్రారంభించారు. అనంతరం కమ్మ హాస్టల్ చరిత్రను ప్రతిబింబించే ‘‘కమ్మ హాస్టల్ చరిత్ర’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శాఖమూరి లక్ష్మీదేవమ్మ కమ్మ హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన సభకు కమ్మ విద్యార్థి సహాయ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ మనిషి ఉన్నత మనుగడకు అత్యంత ముఖ్యమైన విద్య, వైద్య రంగాల్లో కొండబోలు బసవపున్నయ్య నేతత్వంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సేవాభావంతో కొనసాగుతున్న ఈ సంస్థ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు వచ్చి చేయూతనందించాలన్నారు. కార్యక్రమంలో కమ్మ విద్యార్థి సహాయ సంఘ కార్యదర్శి కె.కృష్ణ ప్రసాద్, అధ్యక్షుడు ఎం. బంగారు బాబు ఉపాధ్యక్షుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, సినీ నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వర్లు, బొల్లేపల్లి సత్యన్నారాయణ, ఎన్. కోటేశ్వరరావు, అట్లూరి సుబ్బారావు, రత్నబాబు, డాక్టర్ యర్రా నాగేశ్వర రావు, పూర్వ విద్యార్థులు, పాలక మండలి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.


