కనుల పండువగా దివ్య రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా దివ్య రథోత్సవం

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

కనుల పండువగా దివ్య రథోత్సవం

కనుల పండువగా దివ్య రథోత్సవం

● స్వాగతం పలికిన భక్తజనం ● కోయ నృత్యాలు, బోనాల డాన్సులు, కేరళ వాయిద్యాలతో సందడి

పెదకాకాని: భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం భ్రమరాంబ అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో తెల్లవారుజామున సుప్రభాతసేవ, ఆలయ బలిహరణ, హారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటలకు స్వామివారి దివ్య రథాన్ని శోభాయమానంగా అలంకరించారు.

వైభవంగా దివ్య రథోత్సవం

పెదకాకాని శివాలయంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని ఉంచారు. ఆలయ ఉప కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తలు స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. కోయ నృత్యాలు, బోనాల డ్యాన్సులు, కేరళ వాయిద్యాలు, బ్యాండ్‌ మేళాలు, విద్యుత్‌ కాంతుల నడుమ స్వామి వారి రథోత్సవం పెదకాకాని పురవీధులలో కనుల పండుగగా సాగింది. దివ్యరథంపై శీనులైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామివారు భక్తులను అనుగ్రహించారు. గ్రామ ప్రజలు రథోత్సవానికి దారి పొడవునా స్వాగతం పలికారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రి సమర్పించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు యువతీ యువకులు, భక్తులు పోటీ పడ్డారు. బాణసంచా వెలుతురులో భ్రమరాంబ అమ్మవారి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. పెదకాకాని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేడు స్వామివారి తెప్సోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం భ్రమరాంబ అమ్మవారు విశేష అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం విశేషంగా పూలతో అలంకరించిన హంస వాహనంలో గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారు ఆలయం పక్కనే ఉన్న చెరువులో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement